బంజారాహిల్స్,నవంబర్ 24: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు రహదారులపై రద్దీని తగ్గించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా తీసుకున్న నిర్ణయాల అమలుకు వాహనదారులు సహకరించాలని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ కోరారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 చౌరస్తా వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, సీవీఆర్ చౌరస్తా, రోడ్ నంబర్ 36 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపుపై జాయింట్ కమిషనర్ రంగనాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
నగరంలోని పలు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్ ప్రాంతాలకు వెళ్లేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మీదుగా వెళ్తున్నారని తెలిపారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా రోడ్ నంబర్ 45 వద్ద కుడివైపునకు తిరిగి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా వెళ్లడానికి వేలాదిగా వాహనాలు వస్తుండటంతో ఈ ప్రాంతాలన్నీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోతున్నాయన్నారు. దీంతో సమీపంలోని జర్నలిస్ట్ కాలనీ జంక్షన్, సీవీఆర్ జంక్షన్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోందన్నారు.
ఒక్కో సిగ్నల్ దాటేందుకు సుమారు 15నిమిషాలు పడుతోందని ఇటీవల తాము నిర్వహించిన అధ్యయనంలో తేలిందన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు గల అవకాశాలపై కొన్నిరోజులుగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామని చెప్పారు. దీనిలో భాగంగా కొన్ని మార్గాలను కనుగొని ప్రయోగాత్మకంగా శుక్రవారం నుంచి కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నందున వాహనదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెస్ట్‌జోన్ ట్రాఫిక్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ సీఐ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి అమల్లోకి …
1. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని నటుడు బాలకృష్ణ ఇంటి మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి వెళ్లేందుకు ఉన్న రైట్ టర్న్‌ను మూసివేస్తున్నారు. దీంతో పాటు జర్నలిస్ట్ కాలనీవద్ద యూటర్న్ కూడా అనుమతించరు.
దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి మీదకు వెళ్లాలనుకునే వాహనాలన్నీ జూబ్లీహిల్స్ పోస్ట్నుంచి నేరుగా రోడ్ నంబర్ 36 మీదుగా వెళ్లి పిల్లర్ నంబర్ 1650 వద్ద ఎడమవైపునకు తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 54మీదుగా రోడ్ నంబర్ 45లోని బ్రిడ్జివద్దకు చేరుకోవాలి. బ్రిడ్జి కింద కుడివైపునకు మళ్లి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బ్యాక్ గేటు సమీపంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి చేరుకోవాలి.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 54లోకి వెళ్లకుండా ముందుకు వెళ్లిన వాహనాలు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని క్రోమా షోరూమ్ వద్ద ఎడమవైపునకు తిరిగి రోడ్ నంబర్ 39లోకి ప్రవేశించాలి. మంగోలియా బేకరీ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని రోడ్ నంబర్ 45 మీదుగా రావాలి. అక్కడి నుంచి జూజోజ్ రెస్టారెంట్ వద్ద యూటర్న్ తీసుకుని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదకు వెళ్లాలి.
2. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కిందనుంచి వచ్చి ఫిలింనగర్ జంక్షన్, కాజా గూడా, బీఎన్ఆర్ హిల్స్ ప్రాంతాలకు వెళ్లాలనుకునే వాహనాలు హార్ట్‌కప్ వద్ద యూటర్న్ తీసుకుని బ్రాడ్వే పబ్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 51, పక్షి సర్కిల్ మీదుగా కొత్తగా వేసిన లింకు రోడ్డు ద్వారా న్యాయవిహార్, పద్మాలయ స్డూడియోస్ మీదుగా ఫిలింనగర్ జంక్షన్‌కు చేరుకోవాలి.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కిందనుంచి వచ్చి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్, బాలకృష్ణ ఇంటివద్ద లెఫ్ట్ టర్న్ తీసుకోవాలనుకునే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలు రోడ్ నంబర్ 54లోని హార్ట్ కప్వద్ద ఎడమవైపునకు తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో పిల్లర్ నంబర్ 1663 వద్ద యూటర్న్/ తీసుకోవాల్సి ఉంటుంది.
3. బంజారాహిల్స్ రోడ్ నంబర్12 వైపునుంచి సీవీఆర్ జంక్షన్, జర్నలిస్టు కాలనీ మీదుగా చెక్‌పోస్ట్‌కు వెళ్లే వాహనదారులు కళింగభవన్ చౌరస్తా వద్ద కుడివైపునకు తిరిగి కేబీఆర్ పార్కు మెయిన్‌గేట్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపునకు వెళ్లడం ద్వారా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45జంక్షన్ వద్ద ఎదురయ్యే ట్రాఫిక్‌ను తప్పించుకోవాలి.
ఫిలింనగర్, సీవీఆర్ జంక్షన్ మీదుగా వచ్చి రోడ్ నంబర్ 45 జంక్షన్ వద్ద నేరుగా చెక్‌పోస్ట్ వైపు వెళ్లడానికి అనుమతి లేదు. వీరంతా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 జంక్షన్‌వద్ద ఎడమవైపు తిరిగి హార్ట్‌కప్ వద్ద యూటర్న్ తీసుకుని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది.
బంజారాహిల్స్, ఫిలింనగర్ వైపునుంచి వచ్చి నేరుగా రోడ్ నంబర్ 45వైపునకు వెళ్లాలనుకునేవారు సీవీఆర్ జంక్షన్‌వద్ద ఎడమవైపునకు తిరిగి భారతీయ విద్యాభవన్ సమీపంలో యూటర్న్ తీసుకుని తిరిగి సీవీఆర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45వైపునకు వెళ్లాలి.