గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Nov 21, 2020 , 06:37:30

ప్రతి ఓటరుకూ ప్రగతి నివేదిక చేరాలి

ప్రతి ఓటరుకూ ప్రగతి నివేదిక చేరాలి

  • గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురేద్దాం
  • టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు
  • ఎలక్షన్లు కాదు మహాయుద్ధం: కేకే

రంగారెడ్డి నమస్తే తెలంగాణ: ఆరేండ్లలో చేసిన ప్రగతిని  నివేదికగా రూపొందించామని, దీనిని ప్రతి ఓటరుకు చేర్చాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌, ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో ఆరేండ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ 10 రోజుల పాటు శ్రమించి బల్దియాపై గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు మాట్లాడుతూ.. ఇవి ఎలక్షన్లు కావని, మహా యుద్ధమని అన్నారు. మహిళలకు 50 శాతం డివిజన్లను రిజర్వ్‌ కాగా టీఆర్‌ఎస్‌ 85శాతం సీట్లను కేటాయించామని తెలిపారు. ఎస్సీలకు 10 స్థానాలు రిజర్వ్‌ చేస్తే పదమూడింటిని కేటాయించామని చెప్పారు. టికెట్లు వచ్చిన వారు అసంతృప్తులను కలుపుకొని పోయి విజయం సాధించాలని సూచించారు. అభ్యర్థులు.. ఈ ఆరేండ్లలో హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.

 ఇటీవల వచ్చిన వరదలకు పేదలు కష్టాలు పడుతుంటే ఒక్కో కుటుంబానికీ రూ. 10 వేల చొప్పున అందించామని చెప్పారు. పేదలు కష్టాల్లో ఉంటే డబ్బు లు ఇవ్వడం తప్పా..? అని కేకే ప్రశ్నించారు. వరద బాధితుల  కోసం ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు చాలకుంటే మరో వంద కోైట్లెనా తీసుకోండి అని చెప్పిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్‌ అన్నారు. ఓర్వలేకనో.. నీచంగానో పేదలకు అందిస్తున్న సాయాన్ని కొన్ని శక్తులు అడ్డుకున్నాయని విమర్శించారు. ఎంత మంది అడ్డుకున్నా డిసెంబర్‌ 4వ తేదీ తర్వాత వరద బాధితులకు సాయం అందిస్తామని కేకే వెల్లడించారు. హైదరాబాద్‌లోజరిగిన అభివృద్ధిని కండ్లారా చూస్తున్నామని చెప్పా రు. గతంలో మంచి నీళ్ల కోసం ఎదురు చూసే వారిమని, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. సిటీకి కావాల్సిన నీళ్లు పుష్కలంగా వచ్చాయన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ గ్రేటర్‌ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో హోంమంత్రి మహ్మముద్‌ ఆలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.