సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : ఉచిత పార్కింగ్‌కు తిలోదకాలిచ్చే మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్, ఆ తర్వాత 30 నుంచి గంట వరకు షాపింగ్ చేసిన తర్వాత రశీదు చూపిస్తేనే ఫ్రీ పార్కింగ్ వెసులుబాటు ఉంటుంది. మూడు గంటలకు మించి ఉంటే సంబంధిత మాల్ నిబంధనల ప్రకారం చార్జీలు వసూలు చేయాలి. ఇది ఉచిత పార్కింగ్ పాలసీ అమలు లక్ష్యం. కానీ చాలా చోట్ల అడ్డగోలు పార్కింగ్ ఫీజులను వసూలు చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు జీహెచ్ఎంసీ ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పకడ్బందీగా ఉచిత పార్కింగ్ పాలసీని అమలు చేయాలని, ఇందుకోసం సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామంటూ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థలకు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘించిన టీఎస్ 07 ఎఫ్‌సీ 0420 వాహనదారుడి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. కూకట్పల్లి జేఎన్టీయూ మంజీరా మెజిస్టిక్ కమర్షియల్ కాంప్లెక్స్‌కు ఈవీడీఎం విభాగం రూ.50వేలు జరిమానా విధించింది.
పౌరులు తమ వంతు బాధ్యత పోషించండి
పౌరులు సైతం అడ్డగోలు దోపిడీని నియంత్రించే ప్రక్రియలో తమ వంతు బాధ్యతను పోషించాలని అధికారులు సూచించారు. అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేసినట్లు తగిన ఆధారాలతో ఫొటో తీసి ఆన్లైన్లో ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్‌కు షేర్ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులపై పెనాల్టీ విధించనున్నామని ఈవీడీఎం విభాగం అదనపు కమిషనర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఈవీడీఎం ట్విట్టర్లో కానీ, జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబరులో సమాచారం అందిస్తే వెంటనే తమ సిబ్బంది ఆయా ఫిర్యాదుదారు వద్దకు వెళ్లి వివరాలను తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇవి తప్పనిసరి.. లేదంటే జరిమానాలు తప్పవు
నోటీసు మేరకు అన్ని వాణిజ్య సంస్థలు, నిర్ణీత నమూనాలో పార్కింగ్ టికెట్లను ముద్రించాలి. టికెట్లపై పార్కింగ్ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్ నంబరు ఉండాలి. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే ‘పెయిడ్’అని, ఉచితమైతే ఎగ్జెంప్టెడ్’ అని స్టాంపు వేయాలి. పార్కింగ్ ఇన్చార్జి సంతకంతో కూడిన పార్కింగ్ టికెట్లను వాహనాలు నిలిపిన అందరికి ఇవ్వాలి. ఈవీడీఎం విభాగం నుంచి నోటీసులు అందిన 15రోజుల్లోగా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. అనంతరం ఈవీడీఎం విభాగం తనిఖీలు చేపడుతుంది. ఉల్లంఘనలు గుర్తిస్తే వారిపై రూ. 50వేల పెనాల్టీని విధిస్తుంది. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి పెనాల్టీలు విధిస్తున్నది.
ఉచిత పార్కింగ్ ఇలా..