ఉస్మానియా యూనివర్సిటీ, మే 14: ఇటీవల ముగిసిన ఆసియా స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థిని సత్తా చాటింది. బీ కామ్ రెండో సంవత్సరం చదువుతున్న ఇ.శృతి ఆ పోటీల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి, మొత్తం ఎనిమిది పతకాలు కొల్లగొట్టింది. వాటిలో ఏషియన్ యూనివర్సిటీస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు, ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో నాలుగు కాంస్య పతకాలు ఉండటం విశేషం.
ఈ పోటీలు ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు హాంగ్‌కాంగ్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ఆమెను కళాశాల చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి, సెక్రెటరీ డాక్టర్ ఎన్.రజని, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఝాన్సీరాణి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.కరుణాదేవి, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఏ.ప్రమీల, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీదేవి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో కళాశాల కీర్తి ప్రతిష్టలు చాటిడం తామందరికీ గర్వకారణంగా ఉందని ప్రశంసించారు.