సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల సవరణ ప్రక్రియ తీవ్ర జాప్యంతో కొట్టుమిట్టాడుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జిల్లాతో పాటు కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో అనామలీస్, నాన్-మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఆశించిన రీతిలో సాగడం లేదు. దేశవ్యాప్తంగా ‘సర్ ’ అమలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతంలోనే ఈ వేగం అత్యంత నెమ్మదిగా ఉందంటూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇప్పటికే తీవ్ర అసంపూర్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 17న ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసి, నాన్-మ్యాపింగ్, అనామలీస్ వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఆదివారం నాటికి నోటీసుల పంపిణీ పూర్తి చేసి, శనివారం (ఈ నెల 29 నుంచి) హియరింగ్‌లు ప్రారంభించి, వచ్చే నెల (సెప్టెంబరు) 16వ తేదీ నాటికి మొత్తం ప్రక్రియ ముగించాలని ఎన్నికల విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రచురించాల్సి ఉంది.అయితే, ఇప్పటివరకు కనీసం 10 శాతం మందికి కూడా నోటీసులు అందలేదు. ముషీరాబాద్, మలక్ పేట, అంబర్ పేట, సనత్ నగర్, బహదూర్ పురా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఒక ఓటరుకు కూడా నోటీసు జారీ కాకపోవడం యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం. కాగా క్యూర్ సిటీ పరిధిలో (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి) 38.93 లక్షలు ఉండగా, హైదరాబాద్ జిల్లాలో మాత్రమే 12,53,000 పైచిలుకు ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 1,00,000 నుండి 1,50,000 మాత్రమే నోటీసులు జారీ చేశారు.
నోటీసుల జారీ నత్తనడకన సాగుతుండటంతో నేటి నుంచి ప్రారంభమయ్యే హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒకో సరిల్ కు అదనంగా 10 మంది అడిషనల్ అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్ల (ఏఏఈఓ)ను నియమించారు. హియరింగ్ లకు సంబంధించి మిగిలిన 19 రోజుల వ్యవధిలో 4 రోజులు సాధారణ సెలవులు పోనూ కేవలం 15 పనిదినాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే, రోజుకు సగటున లక్ష మందికి పైగా నోటీసులు జారీ చేస్తూ, అదే సమయంలో హియరింగ్ పూర్తి చేయడం సాధ్యమేనా అన్న సందిగ్ధత వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, నోటీసుల జారీతో పాటు హియరింగ్ ల నిర్వహణ గడువును పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు.