సిటీబ్యూరో, ఏప్రిల్ 21 ( నమస్తే తెలంగాణ ) : మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ విజయాల బాటలో పయనిస్తున్నారు. గృహిణిగా బాధ్యతను నిర్వర్తిస్తూనే పలు వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలను సమర్ధంగా నిర్వర్తిస్తున్నారు. చిన్న తరహ, కుటిర పరిశ్రమలు స్థాపించి స్వయం ఉపాధి పొందడమే కాకుండా.. ఇతరులకూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అందులో భాగంగానే మహిళలను మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్మాణ్ సంస్థ ఉచితంగా శిక్షణ అందించి బాసటగా నిలుస్తున్నది. శిక్షణ పూర్తయ్యాక వారి వ్యాపారానికి అవసరమయ్యే సామగ్రిని సైతం ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే వందలాది మందికి డిజైనింగ్ నుంచి బ్యూటీ రంగాల వరకు శిక్షణ ఇచ్చి వారిని ఎంట్రప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దింది. మరోసారి నిర్మాణ్ సంస్థ పలు విభాగాల్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధమైంది.
బ్యూటీ కోర్సులో ప్రావీణ్యం సంపాదించాలనుకునేవారు, టైలరింగ్‌లో ప్రొఫెషనల్‌గా ఎదగాలనుకునే వారు, డిజైనింగ్‌పై అవగాహన పెంచుకోవాలనుకునే వారు, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఒక్క రూపాయి ఖర్చులేకుండా అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌తో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ ఉచితంగా అందించే శిక్షణను వినియోగించుకోవచ్చు. మూడు నెలల పాటు అందించనున్న ఈ శిక్షణలో బ్యుటీషియన్, మెహందీ, పెడిక్యూ, ఫేషియల్, క్లీన్ అప్, టైలరింగ్, స్ట్రిచ్చింగ్, ఆధునిక మోడల్స్‌లో డ్రెస్సులు, ఎంబ్రాయిడరీ, మగ్గం తదితర అంశాలపై శిక్షణ ఉంటుంది. 18 నుంచి 40 ఏండ్లలోపు మహిళలకు అవకాశం ఇస్తున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆసక్తిగల వారు 790127 2826, 6309987154, 9603939036, 8801549308 నంబర్లకు ఫోన్ చేసి తమ వివరాలు అందించాలని కోరారు.