ఖైరతాబాద్, జూన్ 22: దేశంలో ఏవియేషన్ రంగం విస్తరిస్తున్నదని, ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియా ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. గ్లోరి స్వరూప తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత 12 ఏండ్లుగా వృత్తిపరమైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ ఏడాది స్మార్ట్ జీసీ ప్రో ఎడ్యుటేక్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో హైబ్రిడ్ ఎయిర్పోర్ట్ ఇండక్షన్ ప్రోగ్రాం చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ఉడాన్ పథకంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దేశంలో అనేక రాష్ర్టాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటవుతున్నాయన్నారు. అయితే, వాటికి తగినంత మానవ వనరులు అవసరం ఉంటుందని, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువతీ యువకులకు ఆ రంగంలో శిక్షణ ఇచ్చి వంద శాతం ప్లేస్మెంట్ కల్పించేందుకు గాను హైబ్రిడ్ ఏవియేషన్ డిప్లమా కోర్సును ప్రవేశపెట్టామన్నారు.
ఈ కోర్సును ఏరోస్పేస్, ఏవియేషన్ సెక్టార్ ఆమోదించిందని, ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ఎయిర్‌పోర్టుల్లో వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆర్నేళ్ల వ్యవధి గల ఈ కోర్సులో థియరీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వర్చువల్‌గా శిక్షణ ఇస్తారన్నారు. వివరాలకు www.nimsme.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో స్మార్ట్ జీసీ ప్రో ఎడ్యుటేక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆపరేషన్స్ సునీష్ ఎంఎస్, నిమ్స్‌మే ఫ్యాకల్టీ సభ్యులు డాక్టర్ దీబ్యేందు చౌదరి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.