బంజారాహిల్స్,ఏప్రిల్ 19: జూబ్లీహిల్స్ డివిజన్లో మురుగు సమస్యలు పరిష్కరించడంతో పాటు మంచినీటి సమస్యలు తీర్చేందుకు రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫిలింనగర్ 18 బస్తీల్లో చేపట్టిన డ్రైనేజీ లైన్ పనులను మంగళవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. భగత్‌సింగ్ కాలనీ, దుర్గాభవానీనగర్, గౌతమ్‌నగర్ తదితర బస్తీల్లో పనులు కొనసాగుతున్న తీరును ఎమ్మెల్యే పరిశీలించడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ఫిలింనగర్ 18 బస్తీల్లో సమస్యల పరిష్కారానికి రూ.98లక్షలతో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. ఈ పనులు పూర్తయిన వెంటనే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డుపనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలోనే రూ.3కోట్లు ఖర్చుచేసి కొత్త డ్రైనేజీలైన్లను, మంచినీటి లైన్లను వేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరో రూ.3కోట్లతో వీడీసీసీ రోడ్డుపనులు చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, నగేష్ సాగర్, సంపంగి కిరణ్, నక్కా రాము, నాని, తదితరులు పాల్గొన్నారు.