వెంగళరావునగర్, డిసెంబర్ 2 : ఆమె ఓ దివ్యాంగురాలు. దివ్యాంగుల ఆత్మహత్యల్ని నివారించి వారికి
బతుకుబాట చూపాలని ప్రయత్నిస్తున్నారు. ఆమే డీ హబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొప్పుల వసుంధర. దివ్యాంగుల కోసం నెలకొల్పిన డీ హబ్‌లో వారు ఉన్న చోటే వ్యాపారం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. రిజిస్ట్రేషన్, పెట్టుబడి, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి తదితర అంశాలపై దివ్యాంగులకు నిపుణుల నుంచి సలహాలు, శిక్షణ కార్యక్రమాలు, సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అలాగే దివ్యాంగుల కోసం ప్రత్యేక ఈవెంట్స్, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 3న దివ్యాంగ దినోత్సవం సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
అనంతపురానికి చెందిన వసుంధర నగరంలోని కల్యాణ్‌నగర్‌లో నివాసముంటున్నది. రెండేండ్ల ప్రాయంలోనే పోలియో బారినపడ్డారు వసుంధర. రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. అయినా కృంగిపోకుండా అవరోధాల్ని అధిగమిస్తూ..ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగారు. ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా, కంటెంట్ రైటర్‌గా నాలుగేండ్లుగా పని చేస్తున్నారు. 2014లో వీవ్ మీడియాస్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి దివ్యాంగుల కోసం ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అంధుల కోసం విజువల్లీ చాలెంజ్డ్ క్రికెట్ లీగ్, దివ్యాంగ మహిళల కోసం మిస్ ఎబిలిటీ అందాల పోటీలు, సామాన్యుల కోసం ఫ్రైడ్ ఆఫ్ ఇండియా వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ నుంచి సేవారత్న అవార్డ్, ఐసీఐసీఐ బ్యాంకు వారి నుంచి నేషనల్ అడ్వాంటేజ్ విమెన్ సత్కారం అందుకున్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు.
డీ హబ్‌తో దివ్యాంగులకు దిశానిర్దేశం
దివ్యాంగులకు అవగాహన, శిక్షణ కోసం వసుంధర డీ హబ్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలి ఇంక్యుబేషన్ సెంటర్ డీ హబ్. దివ్యాంగులంతా ఒక చోట సమావేశమయ్యేలా కృషి చేస్తున్నది. దివ్యాంగుల కోసం ఎన్నో పథకాలు ఉన్నాయి. కానీ వాటికి తగిన ప్రచారం లేకపోవడం వల్ల దివ్యాంగులు తెలుసుకోలేకపోతున్నారని, వారు ఉన్నచోటే వ్యాపారం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. వ్యాపారాలపై అవగాహన, మౌలిక వసతులు, శిక్షణ, ఎంచుకునే మార్గాలు, రిజిస్ట్రేషన్ ప్రాజెక్టులు, రుణాల కోసం బ్యాంకర్లతో మాట్లాడటం, నిలదొక్కుకోవడానికి వారికి సాయపడటం వంటివి చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో సమావేశాలు నిర్వహించి, సలహాలు ఇస్తున్నారు. దివ్యాంగులు తమలోని టాలెంట్‌ను వీడియో రెజ్యూమ్ తయారు చేసుకునేందుకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. WWW.DEHUBINDIA.COM, 85003617 35లో దివ్యాంగులు సంప్రదించాలని సూచించారు.