చాంద్రాయణగుట్ట,13 (నమస్తే తెలంగాణ): విధి నిర్వాహణలో శాంతి భద్రతల సమస్యను వృత్తిలో భాగంగా భావించి ముందుకు సాగాలని, దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సైతం సిద్ధంగా ఉండాలని సీఆర్పీఎఫ్ సౌత్‌జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ రవిదీప్‌సింగ్ సాహి తెలిపారు. శనివారం తెలంగాణ ఎక్స్ సీఏపీఎఫ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్కాస్ సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంట్‌పై జరిగిన దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మాజీ కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్స్ సిబ్బంది సంక్షేమ సంఘం సహకారంతో ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో విధి నిర్వాహణలో ఉండగా ఏదో ఓ విభాగంలో పోలీసులు తరుచూ వేర్వురు దాడుల్లో ప్రాణాలు కొల్పోతున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో ఎంతోమంది పోలీసులు అమరులు అవుతున్నారని చెప్పారు.
శాంతి భద్రతలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం కంటి మీద కునుకు లేకుండా అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. ప్రజల సహకారంతో దేశంలో ఏ చిన్న ఘటన జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్‌జోన్ ఐజీపీ ఏ.శ్రీనివాస్, టి.విక్రమ్‌సింగ్ ఐపీఎస్, గ్రూప్ సెంటర్ డీఐజీ ఉదయ్ భాస్కర్ భల్లా ఐపీఎస్, డీఐజీ రిటైర్డ్ డాక్టర్ వీరరాజు, మాజీ డీఐజీ పోక్రియల్, మాజీ ఏడీజీ హెచ్ఆర్ సింగ్, ఏడీజీ రణవీర్‌సింగ్ (రిటైర్డ్) పలువురు అధికారులు పాల్గొన్నారు.