సిటీబ్యూరో, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి అతడితో గొడవపడి.. దోచుకున్న దొంగల ముఠాను లంగర్‌హౌస్ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. బాధితుడు డయల్ 100కు ఫోన్ చేయడంతో వేగంగా స్పందించి.. నిందితులను పట్టుకున్నారు. సీపీ అంజనీకుమార్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీతాఫల్‌మండీకి చెందిన మర్క శ్రీకాంత్ 26వ తేదీ సాయంత్రం కాటేదన్లో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. రాత్రి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ైఫ్లైఓవర్ కింద, పిల్లర్ నం.71 దగ్గరకు రాగానే మూడు బైక్‌లపై ఐదుగురు వచ్చి, తమ బైక్‌ను ఢీకొడుతావా అంటూ.. ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకున్నారు. శ్రీకాంత్‌తో వాగ్వాదానికి దిగి, అతడి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్ లాక్కొని అత్తాపూర్ వైపు పరారయ్యారు. బాధితుడు వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీ భాస్కర్‌రెడ్డిలు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించి.. సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను గుర్తించారు. గురువారం ఐదుగురిని అరెస్ట్ చేశారు.
అత్తాపూర్, ఎంఎం పహాడీకి చెందిన మహ్మద్ ఖాజా పాషా, మహ్మద్ అస్లం, ఎండీ అసీఫ్, మహ్మద్ హబీబ్, షేక్ ఖాసీం స్నేహితులు. చెడు అలవాట్లకు బానిసయ్యారు. ఉద్యోగాలు కూడా చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఒంటరిగా ద్విచక్రవాహనాలపై వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని దోచుకోవాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఐదుగురు మూడు వాహనాలపై వెళ్తూ.. బాధితుడైన శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అతడి వాహనాన్ని ఆపి ‘నీవు ర్యాష్‌డ్రైవింగ్ చేయడంతో మా బండి దెబ్బతిన్నద’ని దబాయించారు. తన తప్పులేదంటూ బాధితుడు మొత్తుకుంటున్నా.. దోచుకున్నారు. పోలీసులు నిందితుల వద్ద సొత్తుతో పాటు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.