చార్మినార్, ఆగస్టు 23 : మహిళా పోలీసులు ధైర్యంగా, మానసిక ఉల్లాసంగా విధులు నిర్వహించే స్వేచ్ఛా వాతావరణం తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం కల్పించిందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సోమవారం నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోని ప్లేట్లబుర్జు పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో మహిళా పోలీస్ అధికారుల కోసం నవీకరించిన బ్యారక్‌ను అదనపు కమిషనర్లతో కలిసి సీపీ ప్రా రంభించారు. అనంతరం సీపీ అంజనీకుమార్ మాట్లాడు తూ నగర పోలీస్ విభాగంలో మహిళా పోలీస్ అధికారుల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ రిక్రూట్మెంట్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తూ మహిళలకు తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం సీఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో 610 మంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి చెం దిన అనేక దేశాల్లో మహిళా పోలీస్ అధికారులు కేసుల పరిష్కారంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని, అదేవిధంగా నగర పోలీస్ వ్యవస్థలోని మహిళా పోలీస్ అధికారులు సైతం నగరంలోని పరిస్థితులకు అనుగుణంగా విధు లు నిర్వహిస్తున్నారని తెలిపారు. నగరంలోని పోలీస్ విభాగంలో తీసుకువస్తున్న సంస్కరణలు విజయవంతమైతే వాటిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
గతంలో పలుమార్లు సీఆర్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించినప్పుడు మహిళా పోలీస్ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా గమనించినట్లు నగర అడిషనల్ కమిషనర్ శిఖా గోయల్ తెలిపారు. ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకువెళ్లగా.. వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. మహిళా సిబ్బంది ఎక్కడ ఎలాంటి విధులు నిర్వహిస్తున్నా.
ప్రతి అధికారి వారికి వెన్నంటి నిలుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారని తెలిపారు. అదేవిధంగా అదనపు కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ భవిష్యత్తులోనూ మహిళా అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీఆర్‌లో అనువైన వాతావరణం కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ అనిల్‌కుమార్, సీఆర్ ఇన్చార్జి ఏసీపీ సుభాష్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో చురుగ్గా వ్యవహరించడానికి సిబ్బందికి కావాల్సిన మౌలిక వసతులతోపాటు మహిళా పోలీస్ అధికారులకు అవసరమైన విజ్ఞానాన్ని అందించడానికి సీఆర్ హెడ్‌క్వార్టర్‌లో వసతులు కల్పిస్తున్నామని సీపీ తెలిపారు. సిబ్బందికి విజ్ఞానం కోసం ప్రత్యేకంగా రూపొందించిన రిక్రియేషన్ రూంను సీపీ ప్రారంభించారు.
విధులు నిర్వహించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నతాధికారులు సలహాలు, సూచనలు ఇస్తూ మాలో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు. విధులకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో మా పిల్లలను సీఆర్లోని శిశు సంరక్షణ కేంద్రంలో అందిస్తున్నాం. పిల్లల ఆలనాపాలన చూస్తూ మాకు అండగా నిలుస్తున్నారు. – సంగీత, కానిస్టేబుల్