కొండాపూర్, ఆగస్టు 10: కొవిడ్ బారిన పడిన మహిళకు 41 రోజుల పాటు ఎక్మో చికిత్సను అందించి మెడికవర్ దవాఖాన వైద్యులు ప్రాణాలు కాపాడారు. నగరానికి చెందిన మహిళ (36) కొవిడ్‌తో దవాఖానలో చేరినట్లు ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ అధిపతి డాక్టర్ ఘనశ్యామ్ ఎం జగత్కర్ తెలిపారు. మహిళ ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ సహాయంతో ఆక్సిజన్ అందించగా, అది సరిపోక, ప్రోన్ పొజిషన్ (బోర్లా పడుకోబెట్టి)లో ఆక్సిజన్‌ను అందించినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఎక్మో సపోర్ట్ తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్మో సపోర్ట్‌తో మహిళ 41 రోజుల పాటు చికిత్స పొందగా, అనేక అనారోగ్య సమస్యలు, కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చిందన్నారు. నిదానంగా కోలుకున్న అనంతరం, ఎక్మోను తొలగించినప్పటికీ రోగి 90 రోజుల పాటు దవాఖానలో చికిత్స పొంది కొవిడ్‌ను జయించిందన్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. వైద్య బృందంలో డాక్టర్ కృష్ణ ప్రసాద్, ప్రమోద్‌రెడ్డి, డాక్టర్ రఘుకాంత్లు ఉన్నారు.