మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని వీడటంలేదు. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను బయటపెట్టకుండానే భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ పేరిట పరీవాహక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రాజెక్టు స్వరూపం, విస్తీర్ణం, అవసరమయ్యే భూముల వివరాలు ప్రజల ముందు ఉంచకుండానే అభిప్రాయ సేకరణకు పిలుస్తుండటంతో అయోమయానికి గురవుతున్నారు. అసలు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో నోటీసుల్లో పేర్కొన్న సర్వే నంబర్లో ఉన్న మొత్తం భూమి తీసుకుంటారా? అందులో ఎంతభాగం తీసుకుంటారో చెప్పకుండా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
దీంతో ఆయా సర్వేనంబర్లలో భూములు, ఇండ్లు ఉన్న వారందరూ తమ ఆస్తులు కోల్పోతామనే భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఫేజ్-1లో భాగమైన బాపుఘాట్-గండిపేట, బాపుఘాట్-హిమాయత్‌సాగర్ ప్రాంతాల ప్రజలను విభజించి, మభ్యపెట్టి ఆస్తులు గుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేజ్-1ఏలోని బాపుఘాట్-హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రజలను అందరిని ఒకేసారి పిలవకుండా గ్రామాలు, కాలనీలను విడగొట్టి ఐక్యంగా ఉండకుండా విభజించి విడివిడిగా పిలుస్తున్నారు. ఇలా విభజించి పిలవడం వెనుక భూములను గుంజుకునే కుట్ర ఉన్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా అభిప్రాయ సేకరణలో భాగంగా మంగళవారం దర్గా ఖలీజ్‌ఖాన్ గ్రామస్తులను రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయానికి పిలిచారు.
– సిటీ బ్యూరో, బండ్లగూడ, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)
సిటీ బ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: ఆస్తులను కోల్పోతున్న వారికి పరిహారం విషయంలో ఎంఆర్డీసీఎల్ రోజుకో తీరుగా వ్యవహరిస్తున్నది. భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రభుత్వ విలువకు మూడింతలు పరిహారం చెల్లిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ దర్గా ఖలీజ్‌ఖాన్ గ్రామస్తులకు ప్రభుత్వ ధరకు రెండింతలు చెల్లిస్తామని చెబుతున్నారు. దర్గా ఖలీజ్‌ఖాన్ ప్రాంతంలో ఎకరానికి ప్రభుత్వ ధర రూ.82 లక్షలు ఉన్నదని.. దాని ప్రకారంగా రెండింతలు చేస్తూ రూ.1.64 కోట్లు చెల్లిస్తామని తెలిపారు. ఇప్పుడున్న మార్కెట్ ధర ఎకరానికి రూ.40 కోట్లుందని భూ యజమానులు చెబుతున్నారు. దానికి రెండింతలు కాకున్నా మర్కెట్ ధర ప్రకారమైనా చెల్లిస్తే తమ భూములను మూసీ ప్రాజెక్టుకు ఇస్తామని అంటున్నారు. టీడీఆర్, పరిహారంపై అడిగిన ప్రశ్నలకు ఎంఆర్డీసీఎల్ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కేవలం వారు చెప్పాలనుకున్నదే చెప్పి వెళ్లిపోతున్నారని.. అభిప్రాయ సేకరణ అని పిలిచి తమ విన్నపాలు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.
దర్గా ఖలీజ్‌ఖాన్ పరిధి మూసీ పరీవాహక ప్రాంతంలో నాకు 10 ఏకరాల భూమి ఉంది. ఎంఆర్డీసీఎల్ ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ప్రకారం నాభూమి మొత్తం మూసీ ప్రాజెక్టు కింద ఉంది. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరానికి రూ. 82 లక్షలు ఉంది. దానికి రెట్టింపుగా కోటి అరవై నాలుగు లక్షలు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. నా భూమికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నాలుగేండ్ల కిందటే ఎకరానికి రూ.30 కోట్లు ఇస్తామని అడిగారు. ప్రస్తుతం ఎకరానికి కనీసం రూ. 40 కోట్లు ఎకరానికి ఇస్తే మా భూమిని వదులుకుంటాం. లేదంటే గండిపేట మండలం పరిధిలో మా భూమికి బదులుగా మరో చోట భూమిని కేటాయించాలి. – అబ్దుల్లా, మాజీ కార్పొరేటర్
మా ఆస్తులకు మార్కెట్ ధర ప్రకారమే పరిహారం ఇస్తామంటే ఇంకోసారి సమావేశాలకు పిలవాలి. మా అభిప్రాయాలు తీసుకోకుండా అధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తే సమావేశాలకు పిలవొద్దు. మూసీ మురుగును శుభ్రం చేయకుండా సుందరీకరణ అంటూ మా ఆస్తులను గుంజుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. మూసీని అభివృద్ధి చేయాలని ఎవరు అడిగారు? దాని వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఎందుకు పేద ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు? భూములు కోల్పోతామనే ఆందోళనలో నిద్ర పట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. అతి తక్కువ ధరకు తమ భూములను తీసుకోవడం ద్వారా తమ ఇంట్లో ఉన్న వృద్ధులు భయందోళనకు గురవుతున్నారు.
– హసన్బిన్ అబ్దుల్లా, దర్గా ఖలీజ్‌ఖాన్
నిరుపేదలను నట్టేట ముంచేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమ భూములపైకి ఎప్పుడు ఏ బుల్డోజర్ వస్తుందోననే భయంతో నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ సర్కార్ ప్రభుత్వ భూములను వేలం వేసి వందల కోట్లు దండుకుంటున్నది. మూసీ సుందరీకరణ పేరిట మా భూములను మాత్రం అగ్గువకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. మా భూములను కూడా వేలం ద్వారానే తీసుకోవాలి. వేలంలో ఎంత వస్తే అంతే ఇవ్వండి. కాదని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
– మీర్జా బషీర్ బేగ్, దర్గా ఖలీజ్‌ఖాన్