
అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఒక్కనాడు ఉద్యమంలో పాల్గొన్నది లేదు. తెలంగాణ కోసం రోడ్డెక్కింది లేదు.. మహోద్యమం జరిగినప్పుడు సమైక్య నేతల వద్ద మోకరిల్లిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి..ఇప్పుడు తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి పేరుతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన అనుచరులు నిర్వహించిన షో అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హంగామా..బీభత్సంతో సామాన్యులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. మహాత్ముడి జయంతి రోజున ఇదేం లొల్లి అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘విద్యార్థి-నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరిట శనివారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం తీవ్ర విమర్శల పాలైంది. విద్యార్థులు, నిరుద్యోగులు లేని ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దిల్సుఖ్నగర్ చౌరస్తాలో చేసిన హైడ్రామా అంతాఇంతా కాదు.
సాయంత్రం 4గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వస్తారని చెప్పి…ఉదయం పదిన్నర నుంచే రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించే యత్నం చేశారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ దృష్ట్యా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని ముందే సమాచారం ఇచ్చినప్పటికీ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ హంగామా చేశారు. ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పూలమాల వేస్తారని ప్రకటించారు.
అసలు గాంధీ జయంతి రోజున అశాంతి సృష్టించడమేందనేది సామాన్యుల ప్రశ్న. ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా, ఉమ్మడి ఏపీ ఉన్నంత కాలమేకాదు…ఇప్పటికీ చంద్రబాబు బంటుగా ఉంటున్న రేవంత్‌రెడ్డి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేయడమంటే ఆ అమరుడి ఆత్మ క్షోభించదా?..కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఇవన్నీ తెలుసు. కాకుంటే విద్యార్థులు, నిరుద్యోగుల ట్యాగ్ వేసుకొని తన వర్గం నేతలు,కార్యకర్తలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీపై మచ్చ వేసే కుతంత్రలో భాగమే నగరంపై ఈ యుద్ధభేరి.
హైదరాబాద్ సిటీ పోలీసు యాక్ట్‌తో పోలీసు కమిషనర్లకు విశేష అధికారాలు ఉంటాయి. పోలీసు కమిషనరేట్ పరిధిలో పరిస్థితులను ప్రతి వారం విశ్లేషించుకుని వాటికనుగుణంగా ఆంక్షలను, నిబంధనలను జారీ చేస్తారు. ప్రధానంగా శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేసేందుకు ఈ యాక్ట్‌ను ఉపయోగిస్తారు. పరిస్థితులు సరిగా లేవని లేదా ఆ కార్యక్రమం కారణంగా ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నా ఇతర సమస్యలు ఏర్పడే వాతావరణం ఉన్నట్లు గుర్తించినా పోలీసులు వాటికి అనుమతులను తిరస్కరిస్తారు.
ముఖ్యంగా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సిటీలో ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలపై పోలీసులు నిషేధం విధిస్తారు. ఈ యాక్ట్ కింద అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని బైండోవర్ చేసే అధికారం కూడా పోలీసు కమిషనర్లకు ఉంటుంది. ఈ యాక్ట్ కింద పోలీసు కమిషనర్లకు అదనపు జిల్లా జడ్జి అధికారులు ఉంటాయి. హైదరాబాద్ సిటీ పోలీసు యాక్ట్‌ను తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసు కమిషనర్లు ఏడాది పాటు ఆంక్షలను అమలు చేస్తుంటారు.