OU Police Station | సిటీబ్యూరో:ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాలో పోలీసుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. మేం ఏమి .. నడుస్తుందనే భావనతో అక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారు. గతంలో నిరుద్యోగుల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్ట్‌లపై అక్కడి ఇన్స్పెక్టర్ దౌర్జన్యం చేశారు. అటు నిరుద్యోగులను, ఇటు జర్నలిస్ట్‌లపై నోరు పారేసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జర్నలిస్ట్‌లు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఏ మాత్రం స్పందించకపోవడంతో తాము ఆడిందే ఆట.. పాడిందే పాటగా ఉస్మానియా ఠాణా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పొలిటికల్, పోలీసులు ఒక్కటై మామూళ్ల కోసం చెలరేగిపోయి అమాయకులపై బుధవారం ఠాణాలో దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇటీవల విద్యార్థి సంఘం నాయకులపై ఏక పక్షంగా కేసులు పెట్టి జైలుకు పంపించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఠాణా అధికారులు, సిబ్బందితో వేధింపులకు గురైన వారు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు.
ఏకపక్షంగా కేసులు…
ఇటీవల యూనివర్సిటీలో ఫ్లెక్సీల విషయంలో వివాదం జరిగింది. అధికార పార్టీకి చెందిన వారిపై ఈగవాలనీయకుండా, ఠాణా పోలీసులు మరో విద్యార్థి సంఘం నాయకులందరిపై కేసులు పెట్టి జైలుకు పంపించారనే ఆరోపణలున్నాయి.
కరెంట్ పోయిందా..? పోగొట్టారా..?
యూనివర్సిటీ ఠాణాలో గురువారం కరెంట్ లేదని అధికారులు చెబుతున్నారు. అమాయకులను చితకబాదడంతో అందులో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకుండా కరెంట్ కట్ చేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంపై ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామితో మాట్లాడగా, గురువారం ఠాణాలో కరెంట్ లేదని, దీనివల్ల సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదని సిబ్బంది చెప్పారన్నారు.