సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మెహిదీపట్నం సంతోష్‌నగర్ కాలనీలోని సెయింట్ ఆన్స్ మహిళా పీజీ కళాశాలలో ఆదివారం జరిగిన పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్ష కోసం చేసిన ఏర్పాట్లను, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు సీసీ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు జరిగిన పేపర్-1 పరీక్షకు 25,875 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు జరిగిన పేపర్-2 పరీక్షకు 25,661 మంది హాజరయ్యారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 19,492 మంది గైర్హాజరయ్యారని, కేవలం 56-57 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాశారని తెలిపారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లోని సైఫాబాద్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన పర్యవేక్షించారు.