Hyderabad | బంజారాహిల్స్, జూన్ 1 : రాంగ్ రూట్లో వచ్చిన కారు డీకొట్టడంతో సినీ దర్శకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న వర్థమాన సినీ దర్శకుడు శివనాగేంద్రనాథ్ (27) శనివారం రాత్రి 12.30 ప్రాంతంలో షేక్‌పేట నుంచి మణికొండ వైపునకు తన బైక్ మీద వెళ్తున్నాడు. అదే సమయంలో మణికొండ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు షేక్ రఫీ(32), ఫిరోజ్(31), అజారుద్దీన్(28) ఐ20 కారులో గచ్చిబౌలికి వెళ్లే క్రమంలో రాంగ్రూట్లో వస్తూ డీ మార్ట్ సమీపంలో శివనాగేంద్రనాథ్ బైక్‌ను ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన శివనాగేంద్రనాథ్ను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. కాగా ప్రమాద సమయంలో కారు నడిపిస్తున్న షేక్ రఫీతో పాటు షేక్ అజారుద్దీన్లు మద్యం సేవించినట్లు తేలింది. కారు నడిపిస్తున్న రఫీతో పాటు కారులోని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు వారిని ఆదివారం రిమాండ్‌కు తరలించారు.