హైదరాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): నగరంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చి, తదితర చర్చిలు రంగురంగుల విద్యుద్దీపాలతో కళకళలాడాయి. క్రిస్మస్ తాత బహుమతులు, పలు చోట్ల కేక్ కట్ చేసి సందడి చేశారు. క్రిస్మస్ ట్రీలు, శాంతా క్లాజ్లు ఆకట్టుకున్నాయి. మియాపూర్‌లోని కల్వరీ టెంపుల్ భక్తులతో కిటకిటలాడింది. 4 లక్షలకు పైగా భక్తులు పలు ప్రాంతాల నుంచి విచ్చేసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రత్యేకంగా క్రీస్తు గీతాలాపనలు చేశారు. క్రిస్మస్ ట్రీ వద్ద భక్తులు పిల్లలతో కలిసి సెల్ఫీలు దిగి సందడి చేశారు.
శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనకు కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ నెహేమియా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేసీఆర్‌ను కలిసినవారిలో క్రిస్టియన్ జేఏసీ నాయకులు సాల్మన్ రాజు, న్యూలైఫ్ చర్చిస్ బిషప్ నెహేమియా, క్యాథలిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లియో లూయిస్ తదితరులు ఉన్నారు.