బంజారాహిల్స్,జూలై 14: నాలాలు, చెరువుల్లో కబ్జాలు తొలగిస్తున్నాం అని అధికారుల మాటలు కేవలం నీటి మూటలుగానే మిగులతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 1లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్,జూబ్లీహిల్స్ క్లబ్ తదితర ప్రాంతాలనుంచి వచ్చే వరదనీరు వెళ్లేందుకు జీహెచ్ఎంసీకి చెందిన నాలా ఉంది. ఈ నాలా జూబ్లీహిల్స్ రోడ్ నెం 1 ప్రధాన రహదారిపై ఉన్న ప్లాట్ నెంబర్ 65కి, ప్లాట్ నెంబర్ 49సీకి మధ్యనుంచి కింది భాగంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు స్థలం మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని పార్కులో ఉన్న నాలాలో కలుస్తుంది.
దీంతో పాటు ప్లాట్ నెం 64(ఏ)కు, ప్లాట్ నెం 65కి మధ్యనుంచి కూడా మరో నాలా వచ్చి జీహెచ్ఎంసీకి చెందిన పార్కులోని నాలాలో కలుస్తుంటుంది. ఇటీవల ప్రధాన రహదారిపై ప్లాట్ నెం 65లో నిర్మించిన భారీ భవన స్వీపింగ్ యజమానులు తమ ప్లాట్‌కు రెండువైపులా ఉన్న జీహెచ్ఎంసీ నాలాను దర్జాగా ఆక్రమించుకున్నారు. నాలాపై రేకుల షెడ్లను నిర్మించారు. ఏకంగా నాలా సైజును కుదించి వాటర్ సంపులు, బాత్రూమ్స్ కట్టుకున్నారు. సుమారు 10 గదులను ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చారు.
కాగా పక్కనున్న ప్లాట్ నెం 49(సీ)లో నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణదారులు తమవంతుగా నాలాను ఆనుకుని ఖాళీ ఉండాల్సిన బఫర్‌జోన్‌లో ఏకంగా పది అడుగుల ఎత్తుతో ప్రహరీ నిర్మించుకున్నారు. మూడోవైపున 64(ఏ) ప్లాట్‌కు చెందిన వారు సైతం నాలాను ఆనుకుని బఫర్ జోన్ వదిలిపెట్టకుండా నిర్మాణాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదంటూ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ ఆరోపించారు.