సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : వివిధ కారణాలతో మరణించిన పోలీసులకు సంబంధించిన పెన్షన్లు, ఉద్యోగాలు వారి కుటుంబాలకు త్వరగా వచ్చేలా చూడాలని, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ఉంటూ చనిపోయిన పోలీసులకు సంబంధించిన భద్రత, ఎక్స్గ్రేషియా చెక్కులను గురువారం వారి కుటుంబాలకు అందజేశారు. పోచంపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తూ మరణించిన జాన్సన్ భార్య సునీతకు భద్రత నుంచి రూ.7,99,160, విడో ఫండ్ రూ.10 వేలు, ప్లాగ్ ఫండ్ రూ.10 వేలు, కార్ఫస్ ఫండ్ రూ.50 వేల చెక్కులను అందజేశారు. అలాగే మల్కాజిగిరి ఠాణాకు చెందిన కానిస్టేబుల్ నరేశ్ మృతి చెందడంతో ఆయన భార్య లక్ష్మీబాయికి భద్రత కింద రూ.3,93,700, ఆయన కూతురు పేరుపై రూ.1,96,850, కొడుకు పేరుపై రూ.1,96,850 చెక్కులను సీపీ అందించారు. ఈ సందర్భంగా సీపీ చౌహాన్ మాట్లాడుతూ మృతి చెందిన వారి కుటుంబాలకు రావాల్సినవి వారికి త్వరగా వచ్చేవిధంగా చూడాలని అడ్మిన్ అదనపు డీసీపీ నర్మదతో పాటు పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, మినిస్టిరియల్ సిబ్బందిని ఆదేశించారు.