వనస్థలిపురం : ఉద్యోగులు, పేద ప్రజలకు మట్టపర్తి చంద్రారావు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎన్జీవోస్ కాలనీ గ్రంథాలయం మైదానంలో చంద్రారావు సంతాప సభను నిర్వహించారు.
కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డిలతో కలిసి ఆయన హాజరయ్యారు. సిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఎన్జీవోస్ కాలనీ అధ్యక్షుడిగా, ఏరియా దవాఖాన అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ఆయన ఎన్నో సేవలందించారన్నారు.
85 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రజల గురించి, వారి సమస్యల గురించి ఆలోచించారన్నారు. కాలనీలో గ్రాంథాలయం, కమ్యూనిటీ హాలు, సీనియర్ సిటిజన్ భవన్‌ను ఒకే కాంప్లెక్స్‌గా నిర్మించి చంద్రారావుపేరు పెడతామన్నారు. కార్యక్రమంలో పెన్షనర్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొలిశెట్టి లక్ష్మయ్య, పంపన వెంకటేశ్వరరావు, గౌడ, శెట్టిబలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు.