సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ)/ మేడ్చల్, సుల్తాన్‌బజార్,కంటోన్మెంట్ ;ప్రగతి రథ చక్రాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వ రథ చక్రంగా మార్చేశారు. అడగంది అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు.. కానీ సీఎం కేసీఆర్ అడగకున్నా.. వారి అవసరాలను తెలుసుకొని అండగా నిలుస్తారు. అర్టీసీ విషయంలో కూడా సీఎం కేసీఆర్ యావత్ కార్మిక లోకం హర్షించే నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎన్నో ఏండ్లుగా పీఆర్సీ ప్రకటించాలని కోరుతుండగా.. సీఎం కేసీఆర్ అంతకు మించిన తీపి కబురు అందజేశారు. ప్రగతి రథ చక్రాన్ని ప్రభుత్వ రథ చక్రంగా మార్చడమే కాకుండా.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కేబినెట్లో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన వెంటనే 43వేల పైచిలుకు కార్మికుల కుటుంబాలు సంబురాల్లో మునిగితేలాయి. గతంలో ఏ ప్రభుత్వం ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదని, సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల కష్టాలను ఉద్యమ సమయంలో దగ్గరుండి చూసిన సీఎం కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తూ వస్తున్నారని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత పెరిగింది
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిని గుర్తించడంతో ఉద్యోగ భద్రత పెరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణ పడి ఉంటాం. మా జీవితంలో మరిచిపోలేని రోజు.
– బి. దుర్గా బాయి, కంటోన్మెంట్ డిపో కండక్టర్
మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది
మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం సంతోషంగా ఉంది. జీత భత్యాల విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. తమను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పని చేస్తూ ప్రజలకు మరింత ఉన్నతంగా సేవలందిస్తాం. ఏ బాధ్యతను తమకు అప్పగించినా అమలులో ముందుంటాం.
– తాళ్ల శ్రీనివాస్, టీజేఎంయూ మేడ్చల్ డిపో కార్యదర్శి
చిరస్థాయిగా రుణపడి ఉంటాం
నిత్యం విధి నిర్వహణలో వేల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రకటించడం సంతోషించదగ్గ విషయం. వేల మంది కార్మికుల జీవితాల్లో ఈ ప్రకటన ఆనందాన్ని నింపింది. తెలంగాణ క్యాబినెట్లో తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్ ఆర్టీసీ కార్మిక లోకం సీఎం కేసీఆర్‌కు చిరస్థాయిగా రుణపడి ఉంటుంది.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ఇప్పటి వరకు కార్మికులుగా ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులతో పా టు సమానంగా తమకు జీత భత్యాలు అందుతా యి. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలు సీఎం కేసీఆర్‌కు ఎంతో రుణపడి ఉంటాయి.
– ఆర్టీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఏఆర్‌రెడ్డి
ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షనీయం. అసెంబ్లీ సెషన్లో బిల్లును ప్రవేశ పెట్టి వెంటనే ఆమోదించాలి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ ప్రకటన తీపి కబురు వంటిదే.
– శ్రీనివాసాచారి, ఆర్టీసీ ఉద్యోగి
43వేల కుటుంబాల్లో ఆనందం
ఆర్టీసీ ఉద్యోగుల మనసెరిగిన నాయకుడు సీఎం కేసీఆర్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించి ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆర్టీసీలో విధులు నిర్వర్తిస్తున్న 43 వేల మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఈ ప్రకటన ఆనందాన్ని నింపింది.
– సీస నర్సయ్య గౌడ్, ఆర్టీసీ ఉద్యోగి
వేధింపుల నుంచి విముక్తి
సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రి వర్గ మండలిలో తీసుకున్న నిర్ణయం గొప్పది. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు తెలిసిన సీఎం కేసీఆర్ మా కుటుంబ సభ్యుల్లో ఒక్కరిగా మా సమస్యలను గుర్తించి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఉద్యోగుల భద్రత, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, అధికారుల వేధింపులు తదితర సమస్యల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఇక నుంచి విముక్తి కల్గింది. ఆర్టీసీ సంస్థలో ఇటీవల రిటైర్డు అయిన ఉద్యోగులు, కార్మికుల గురించి కూడా ప్రభుత్వం కొంచం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– ఇప్పల రాములు, కంటోన్మెంట్ డిపో కండక్టర్