సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశంలో అతిపెద్ద నమూనాల తయారీ కేంద్రంగా ఉన్న టీ వర్క్స్‌లో ఉత్తమ బైట్ బైండింగ్ చాంపియన్‌షిప్-2023ని ఆదివారం నిర్వహించారు. సెమి కండక్టర్స్ రంగంలోని ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ప్రతిభ, ఆవిష్కరణల ప్రదర్శనను బెస్ట్ బైట్ బెండింగ్ చాంపియన్ షిప్ పేరుతో చేపట్టారు.
ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ఇంజినీర్ల నుంచి 600 దరఖాస్తులు వచ్చాయి. రెండు మార్లు జరిగిన వర్చువల్ పోటీ రౌండ్ల తర్వాత 24 గంటల మారథాన్‌ను నిర్వహించారు. ఇందులో బైట్ బైండర్స్ అనే ప్రతిష్టాత్మక టైటిల్ కోసం పోటీ పడేందుకు 25 మందిని ఎంపిక చేశామని టీవర్క్స్ డైరెక్టర్ ఆఫ్ పార్టనర్షిప్స్ వీర చప్పి తెలిపారు. బైట్ బైండింగ్ చాలెంజ్ విజేతలను ప్రకటించి, వారికి నగదు బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు.