వెంగళరావునగర్, అక్టోబర్ 8: వ్యాపారిని కిడ్నాప్ చేసి తుపాకులతో బెదిరించి రూ.10 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. మియాపూర్‌లో వాకింగ్ చేస్తున్న వ్యాపారిని బలవంతంగా అపహరించి..ఎల్లారెడ్డిగూడలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో నిర్బంధించారు. దుండగుల నిర్బంధంలో ఉన్న ఆ బాధిత వ్యాపారి తన లొకేషన్‌ను భార్యకు షేర్ చేయడంతో ఆమె డయల్ 100 ఫోన్ చేసి సమాచారమిచ్చింది.
రంగంలోకి దిగిన మధురానగర్ పోలీసులు ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం బాచుపల్లికు చెందిన మనోజ్‌కుమార్(44) ఈనెల 6వ తేదీన సాయంత్రం 6గంటలకు వెంకట్ స్వరూప్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి బాచుపల్లిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనోజ్‌కుమార్‌ను ఒప్పించి స్వరూప్ ఎల్లారెడ్డిగూడలోని తమ కార్యాలయానికి తీసుకెళ్లాడు.
అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో అప్పటికే అక్కడ ఉన్న వారు తుపాకులతో మనోజ్‌కుమార్‌ను బెదిరించి దాడి చేసి నిర్బంధించారు. తన వద్ద తీసుకున్న రూ.10కోట్లు తమకిస్తే వదిలేస్తామని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. వ్యాపారి మనోజ్‌కుమార్‌ను అతడి భార్యతో ఫోన్లో మాట్లాడించి డబ్బు సిద్ధం చేసి అమీర్‌పేట్ మైత్రీవనం ఫిల్లర్ నంబర్ 1039 వద్దకు తేవాలని చెప్పించారు. తాను నిర్బంధంలో ఉన్న ప్రదేశం గురించి మనోజ్‌కుమార్ ఉన్న లొకేషన్‌ను సీక్రెట్‌గా భార్యకు షేర్ చేశాడు.
ఆమె వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిఘా పెట్టి కిడ్నాపర్లు చెప్పిన లొకేషన్‌కు డబ్బు తెచ్చామని చెప్పి నిందితుల్ని అక్కడికి రప్పించారు. నిందితుల్లో ముగ్గుర్ని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారయ్యారు. కిడ్నాపర్ల చెర నుంచి వ్యాపారిని పోలీసులు విడిపించారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వీరి మధ్య ఆర్థిక లావేదేవీలు ఉన్నాయని, డబ్బులు తీసుకొని ఇవ్వనందుకే మనోజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసినట్లు ఓ నిందితుడు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. బాధితుడు మనోజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం మియాపూర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.