సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో సింగిల్ విండో విధానాన్ని మాత్రమే అమలు చేయనున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల కోసం 2016 నుంచి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్)ను ప్రారంభించగా, దాని స్థానంలో కొత్తగా టీ ఎస్ బీపాస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రెండు విధానాల్లో అనుమతులకు అవకాశం ఉంది. జూలై 1 నుంచి కేవలం టీఎస్ బీపాస్ ద్వారానే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాల్లో విస్తరించి ఉన్నది. ఇందులో జీహెచ్ఎంసీతో పాటు 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు, 697 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణ, లే అవుట్ల అనుమతులు డీపీఎంఎస్ ద్వారా ఇస్తుండగా, ఇక నుంచి హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ టీఎస్ బీపాస్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు అనుగుణంగానే వెబ్సైట్ మార్పులు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని అధికారులు తెలిపారు.
భవన నిర్మాణ అనుమతులను ఎంతో పారదర్శకంగా, వేగవంతంగా ఇచ్చేలా టీఎస్ బీపాస్ విధానాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. అనుమతుల్లో జాప్యం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలో ప్లాట్ల విస్తీర్ణాన్ని బట్టి టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణాల కోసం అనుమతిస్తున్నారు. ఇప్పటి వరకు డీపీఎంఎస్, డీటీసీపీ పరిధిలో అనుమతులు తీసుకున్న గ్రామాలను, ఇక నుంచి టీఎస్ బీపాస్ పరిధిలోకి తీసుకొచ్చారు. జీపీ లే అవుట్ పర్మిషన్ కోసం టీఎస్ బీపాస్లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇందుకు సంబంధించిన వెబ్సైట్ లింకు హెచ్ఎండీఏ వెబ్సైట్ నుంచే అనుసంధానం చేశామన్నారు . ఇప్పటి వరకు డీపీఎంఎస్ విధానంలో దరఖాస్తు చేసుకున్న వాటినే పాత విధానంలోనే అనుమతుల ప్రక్రియ ఉంటుంది. పాత దరఖాస్తులు మాత్రమే డీపీఎంఎస్ విధానంలో ప్లానింగ్ విభాగం అధికారులు పరిశీలన చేసి.. అనుమతులు మంజూరు చేస్తారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు ఎంతో సమర్థవంతమైన టీఎస్ బీపాస్ విధానాన్ని హెచ్ఎండీఏ పరిధిలో పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. తద్వారా వేగంగా అనుమతుల ప్రక్రియ ఉంటుందని ప్లానింగ్ అధికారులు తెలిపారు.