కాచిగూడ : కుల, మతాలకు అతీతంగా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టె బోనాల (Bonalu) పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (MLA Kaleru Venkatesh) కోరారు. శుక్రవారం అంబర్‌పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్లకు సంబంధించిన 128 దేవాలయాలకు రూ. 50.82 లక్షల చెక్కులను ఆలయాల నిర్వాహకులకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్(KCR) హయంలో బోనాల పండుగకు కళ వచ్చిందని పేర్కొన్నారు. ఆశాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగను తెలంగాణ మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలను మంజూరు చేసిందని పేర్కొన్నారు.
దీంతో ఆలయాల అభివృద్ధితో పాటు పండుగలకు పూర్వవైభవం వచ్చిందని వెల్లడించారు. బోనాలకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ ఎ.బాలాజీ, తుల్జాభవన్ ఈవో అంజనారెడ్డి, కార్పొరేటర్లు ఉమ రమేశ్‌యాదవ్, దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, అమృత, పద్మా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.