వివాదానికి దారితీసిన వాట్సాప్ మెసేజ్
అంబర్‌పేటలో ఉద్రిక్తత.. భగ్గుమన్న దళిత సంఘాలు
మాట్లాడుకుందామని పిలిచిన బీజేపీ నేత
టీఆర్ఎస్ నేత వెళ్లగానే కత్తితో దాడి
పరారీలో బీజేపీ నేత మహేశ్
కఠిన చర్యలు తీసుకోవాలి
డీసీపీకి ఎమ్మెల్యే కాలేరు ఫిర్యాదు
గోల్నాక/ కాచిగూడ, మే 24 : టీఆర్ఎస్ నేతను మాట్లాడుకుందామని పిలిచిన బీజేపీ నేత కత్తితో దాడికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇస్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యూనల్లకుంటలోని నర్సింహాబస్తీ ప్రాంతానికి చెందిన లక్ష్మయ్య కుమారుడు మేడి ప్రసాద్(43)వాట్సాప్ గ్రూప్‌లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాల ఫొటోలను పోస్ట్ చేశాడు. అది చూసి ఓర్వలేక రత్నానగర్ ప్రాంతానికి చెందిన బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేశ్ వాట్సాప్‌లోనే మెసేజ్‌లతో మేడి ప్రసాద్‌తో వాదనకు దిగాడు. కొద్ది సేపటి తరువాత ప్రసాద్‌కు ఫోన్‌చేసిన మహేశ్ రత్నానగర్లోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు రండి.. అక్కడ మాట్లాడుకుందామని చెప్పాడు. దీంతో ప్రసాద్ సోమవారం రాత్రి 11గంటల ప్రాంతంలో రత్నానగర్లోని హనుమాన్ ఆలయం వద్దకు చేరుకున్నాడు.
అప్పటికే అక్కడ ఉన్న మహేశ్ ప్రసాద్‌తో వాదనకు దిగాడు. ఇద్దరి మధ్యన మాటమాట పెరిగింది. ఈ క్రమంలో మహేశ్ ఆగ్రహానికి గురై టీఆర్ఎస్ నేత ప్రసాద్‌పై కత్తితో దాడికి దిగాడు. ప్రసాద్ కడుపుతో పాటు చేతిపై కత్తి గాట్లు పడ్డాయి. తీవ్రగాయాలపాలైన ప్రసాద్‌ను వెంటనే ఉస్మానియా దవాఖానకు తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈ మేరకు మహేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆరుగురు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి తన కొడుకుపై దాడి చేశారని మహేశ్ తల్లి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం.
తీవ్ర గాయాలతో మేడి ప్రసాద్
పరామర్శించిన ఎమ్మెల్యే కాలేరు..
కేంద్ర మంత్రి అండదండలతో బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేడి ప్రసాద్‌పై బీజేపీ నేత కత్తితో దాడి చేసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వెంటనే దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రసాద్‌ను పరామర్శించారు. అనంతరం బాధితుడితో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ సతీష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కత్తితో దాడికి పాల్పడిన బీజేపీ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.
డీసీపీ కార్యాలయం వద్ద నిరసన
టీఆర్ఎస్ పార్టీ నాయకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ డీసీపీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నేత దూసరి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దళిత చైతన్య వేదిక ప్రతినిధులు అంబర్‌పేట ఈస్ట్ జోన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక ప్రతినిధులు ఎం.మహేందర్, గొల్లపల్లి శంకర్, ముద్దం బాల్‌రాజ్, ఈఎస్ ధనూంజయ, దారయోబు, ఆర్కే బాబు, బి.లక్ష్మణ్, రెడిపాక రాము, అమనూరి సతీశ్, ఎం.రాజేశ్, పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.