సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు ఖండాంతర అవకాశాలను అందిస్తూ భవిష్యత్తులో వివిధ అంశాలపై శక్తివంతమైన నాయకులుగా తీర్చిదిద్దేందుకు వీఐటీ మారిషిస్, అమెరికాలోని బింగ్హామ్టన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఈ మేరకు వీఐటీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ డాక్టర్ జీ విశ్వనాథన్, న్యూయార్కులోని బింగ్హామ్టన్ యూనివర్సిటీ అధ్యక్షుడు డాక్టర్ హార్వే జీ స్టెంజర్.. బింగ్హామ్టన్ యూనివర్సిటీలో నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం.స్టాన్లీ విట్టింగ్‌హామ్, ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందం దీర్ఘకాలం పాటు కొనసాగడంతో పాటు విద్యార్థులను నైపుణ్యం కలిగిన నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు విశ్వనాథన్ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాభోధన కోసం వీఐటీ మారిషిస్ను హిందు మహా సముద్రంలోని మారిషిస్లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు భోధన చేస్తున్నామని ఎక్కువగా ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాల నుంచి విద్యార్థులు వస్తుంటారని తెలిపారు. మారిషిస్లో మంచి వాతావారణంతో పాటు సురక్షితమైన దేశమని, ఆంగ్లం ఇక్కడ అధికారిక భాష అని తెలిపారు. ఇక్కడ విద్యార్థులకు వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకునే వీలుందని, 3 సంవత్సరాల వర్క్ పర్మిట్ లభిస్తుందన్నారు.
వీఐటీ మారిషిస్ హైయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్(హెఈసీ), గవర్నమెంట్ ఆఫ్ మారిషిస్ నుంచి గుర్తింపు పొందిందని, బ్యాచ్‌లర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ), కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని..జూలై 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.