ఆ క్యూఆర్‌లతో.. క్యూరిషింగ్.!
క్యూరిషింగ్.. సరికొత్త సైబర్ మోసం. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్‌ను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సరికొత్త నేర విధానం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నది. ఈ తరహా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో దాదాపు ఆన్లైన్ చెల్లింపులే జరుగుతున్నాయి
- తెరపైకి సరికొత్త సైబర్ మోసం..
- క్యూఆర్ కోడ్‌ను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
- జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న సైబర్ సెక్యూరిటీ నిపుణులు
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): క్యూరిషింగ్.. సరికొత్త సైబర్ మోసం. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్‌ను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సరికొత్త నేర విధానం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నది. ఈ తరహా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో దాదాపు ఆన్లైన్ చెల్లింపులే జరుగుతున్నాయి. అందులోనూ క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్)కోడ్ వాడటంతో చేసే నగదు చెల్లింపులు పరిపాటి అయ్యాయి. రోజువారీ జీవితంలో పచారి కొట్లో కొనుగోలు మొదలు, సింగిల్ చాయ్ బిల్లు వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం.. ఫోన్ పే, గూగుల్ పే చేయడం ద్వారా చెల్లింపులు జరుపుతున్నాయి. అంతే కాదు.. కొవిడ్ విజృంభణ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు పెద్ద కంపెనీలు తమ వెబ్సైట్లు, బిజినెస్ కార్డులు, బ్రోచర్లు, ఇలా ప్రతి సమాచారమూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు వచ్చేలా ఆప్షన్లు ఇస్తున్నాయి. కానీ, ఇక మీదట మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు క్యూరిషింగ్కు గురికాకుండా ఒకింత జాగ్రత్త తప్పనిసరి. ఎందుకో ఓసారి తెలుసుకుందాం.
క్యూఆర్ కోడ్ అంటే..?
క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇది చదరపు ఆకారంలో ఉంటుంది. బార్కోడ్ మాదిరిగానే ఇందులో కోడ్ నిక్షిప్తం చేసి ఉంటుంది. మన ఫోన్లోని కెమెరాతో క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే సంబంధిత కంపెనీ, సంస్థకు సంబంధించి యూఆర్ఎల్ లింక్‌లోకి మనం నేరుగా వెళ్లవచ్చు. క్యూఆర్ కోడ్‌ను 1994లో డెన్సోవేవ్ అనే జపనీస్ కంపెనీకి చెందిన మసహిరో హరా కనిపెట్టారు. క్యూఆర్ కోడ్ బార్‌కోడ్‌తో పోలిస్తే 2 డైమెన్షల్స్లో డాటా నిక్షిప్తమై ఉం టుంది. దీనిలో 4,296 అల్ఫాన్యుమరిక్ క్యారెక్టర్స్ ఉంటా యి. ఇది టు డైమెన్షనల్ కాబట్టి బార్కోడ్లా కాకుండా ఎటు నుంచి స్కాన్ చేసినా పనిచేస్తుంది.
ఏమిటీ ఈ క్యూరిషింగ్..
మనందరికీ ఫిషింగ్ మెయిల్స్, విషింగ్ (వాయిస్ బేస్డ్ ఫిషింగ్), స్కిమ్మింగ్ (ఎస్ఎంఎస్ బేస్డ్ ఫిషింగ్ అటాక్స్) తెలుసు. కానీ, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకో తరహా సైబర్ అటాక్.. క్యూరిషింగ్. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు కొన్ని క్యూఆర్ కోడ్లను సృష్టిస్తున్నారు. వీటిని ఉపయోగించి మన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. అనుమానాస్పద క్యూఆర్ కోడ్లను మనం స్కాన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్లోకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతుంటాయి. లేదంటే క్యూఆర్ కోడ్‌ను మనం స్కాన్ చేయగానే మనల్ని అవి అన్‌సేఫ్ ( సైబర్ నేరగాళ్ల ఆధీనంలో ఉండే) వెబ్సైట్లోకి తీసుకెళ్లేలా యూఆర్ఎల్ లింకులు జత చేసి ఉంటున్నాయి. ఇలా సైబర్ నేరగాళ్లు మనల్ని మోసగించేందుకు ఉచ్చుపన్నుతున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా చేస్తే మేలు…
- అపరిచితులు పంపే ఈ మెయిల్స్, వాట్సాప్, ఇతర డాక్యుమెంట్లలోని క్యూఆర్ కోడ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కాన్ చేయవద్దు.
- మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు అది నిజమైనదా..! లేదా అన్నది నిర్ధారించుకోవాలి. అందుకోసం ఆ క్యూఆర్ కోడ్ కింద రాసి ఉన్న యూఆర్ఎల్ లింక్ మనం స్కాన్ చేసిన తర్వాత వచ్చిన వివరాలు ఒకేలా ఉన్నాయా.! లేదా అన్నది స్పెల్లింగ్ మిస్టేక్స్తో సహా చూసుకోవాలి.
- క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మొబైల్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఎవరైనా సూచిస్తే అవి నిజమైనవా.! లేదా అన్నది చూసిన తర్వాతే ఇన్స్టాల్ చేసుకోవాలి.
- క్యూఆర్ కోడ్‌తో మొబైల్ యాప్స్‌ను ఇన్స్టాల్ చేసే సమయంలో టర్మ్స్ అండ్ కండీషన్లు అన్నింటికీ ఓకే చెప్పకూడదు. కొన్ని క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన మొబైల్ కెమెరా ఆన్‌చేసి వీడియో, ఫొటోలను తీసి వాటిని హ్యాకర్స్‌కు పంపే ప్రమాదం ఉంటుంది.
- మొబైల్ ఫోన్లలో ఎప్పటికప్పుడు యాంటీ వైరస్ ఇన్స్టాల్ చేసుకోవడం, అప్డేట్ చేసుకోవడం ఉత్తమం.
- కంపెనీలు, దుకాణాల వారు క్యూఆర్ కోడ్ వాడుతున్నట్లయితే తప్పకుండా ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకోవాలి. కొందరు సైబర్ నేరగాళ్లు కంపెనీలు, దుకాణాలకు చెందిన క్యూఆర్ కోడ్లను మార్చి వాటిపై మరొకటి అంటిస్తూ మోసగిస్తున్నారు.
- క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేసుకోవడం కూడా నమ్మదగిన వెబ్సైట్ల నుంచి మాత్రమే చేసుకోవాలి.
క్యూఆర్ కోడ్‌తో ఇటీవల జరిగిన కొన్ని మోసాలు చూస్తే…
- ఆన్లైన్ బ్యాంకింగ్ వాడే ఖాతాదారులకు బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ప్రైవసీ అప్డేట్స్ పేరిట పలు నకిలీ ఈ మెయిల్స్ నుంచి క్యూఆర్ కోడ్ లింకులు వచ్చాయి. వీటిని స్కాన్ చేసి ఎంతో మంది మోసపోయారు.
- కొవిడ్ వెరిఫికేషన్ పేరిట కూడా చాలా ప్రాంతా ల్లో సైబర్ నేరగాళ్లు ఫేక్ క్యూఆర్ కోడ్లను పోస్ట్ చేశారు.
- బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాల్లో, ఇతర కంపెనీలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లపైన నకిలీ క్యూఆర్ కోడ్ లింక్‌లు పోస్ట్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- beware
- Cyber Crime
- fake
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

