శేరిలింగంపల్లి, జూన్ 12: డేటింగ్ యాప్‌లో పరిచయాలు పెంచుకొని పబ్‌లకు తీసుకెళ్లి వేల రూపాయల బిల్లు కట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.40 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ మోష్పబ్ వేదికగా నడుస్తున్న ఈ ముఠా బాగోతాన్ని పోలీసులు ఛేదించారు. ఢిల్లీకి చెందిన ఆరుగురు ముఠా సభ్యులతో పాటు ముగ్గురు మోష్ పబ్ నిర్వాహకులు, ఓ మేనేజర్ సహా 10 మందిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ జి.వినీత్ వెల్లడించారు.
ఢిల్లీ విశ్వాస్నగర్కు చెందిన ఆకాశ్‌కుమార్(27), సూరజ్‌కుమార్(23) ఈవెంట్ మేనేజర్లుగా గతంలో ఢిల్లీలోని డెవిల్స్ నైట్ క్లబ్‌ను నిర్వహించారు. కొద్ది రోజుల తర్వాత ఢిల్లీకి చెందిన అక్షత్ నరుల (23), తరుణ్(30), శివరాజ్ నాయక్(27), రోహిత్ కుమార్(19) ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి క్లబ్‌కు కస్టమర్లు రావడం కోసం అందమైన అమ్మాయిలతో డేటింగ్ యాప్‌ల ద్వారా యువకులను ఆకర్షించి.. పబ్‌కు రప్పించి అధిక బిల్లులు వేసి వారి జేబులు ఖాళీ చేయించారు. ఈశాన్య రాష్ర్టాలకు చెందిన అందమైన నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మించి.. తమ డెవిల్స్ నైట్ క్లబ్లో రిక్రూట్ చేసుకున్నారు. సదరు అమ్మాయిల ఫొటోలతో మారు పేర్లు, అడ్రస్‌లతో ఫేక్ అకౌంట్లను ఆన్లైన్లో వివిధ డేటింగ్ యాప్‌లలో రిజిస్ట్రర్ చేశారు. యువతులు డేటింగ్ యాప్‌ల ద్వారా పలువురు యువకులతో చాటింగ్ చేస్తూ పరిచయాలు పెంచుకుంటారు. వీరితో చాటింగ్ చేసిన యువకులు బయట కలిసేంత వరకు ఈ ముఠా సభ్యులే కథ నడిపిస్తారు.
అనంతరం బయటకు వచ్చిన వారితో కాసేపు కాపీ షాపుల్లో మాట్లాడి.. ఆ తర్వాత పథకం ప్రకారం పబ్‌కు తీసుకువచ్చేందుకు అమ్మాయిలను పంపిస్తారు. దీంతో అమ్మాయిలు ముందస్తు పథకంలో భాగంగా వారిని పబ్‌లోకి తీసుకొస్తారు. అక్కడ కాసేపు ఇద్దరు కలిసి మద్యం సేవిస్తారు. అనంతరం వీరు అధిక రేట్లతో రూపొందించిన ప్రత్యేక మెనూ కార్డులు చూపిస్తూ పెద్ద మొత్తంలో బిల్లులు సదరు కస్టమర్ నుంచి వసూలు చేస్తారు. బిల్లు కట్టే సమయానికి అమ్మాయి కనిపించకుండాపోతుంది. అమ్మాయితో వచ్చిన వ్యక్తి నుంచి ఆ బిల్లు మొత్తాన్ని వసూలు చేస్తారు. ఒక్కో కస్టమర్ నుంచి దాదాపు రూ. 30వేల నుంచి 40 వేల వరకు బిల్లులు వసూలు చేస్తారు. కొద్ది రోజుల తర్వాత ఈ ముఠా తమ మకాంను బెంగళూర్‌కు మార్చింది. అక్కడ గూగుల్ రేటింగ్ ఆధారంగా నష్టాల్లో ఉన్న ఓ పబ్‌ను ఎంపిక చేసుకొని.. వారిని సంప్రదించి తిరిగి అదే తరహాలో మోసాలకు పాల్పడ్డారు. ఆ తర్వాత వారి కన్ను హైదరాబాద్ నగరంపై పడింది.
మోష్పబ్ వేదికగా మోసాలు..
ఈ ముఠా మాదాపూర్ మోష్పబ్ను ఎంపిక చేసుకుంది. మోష్పబ్ మేనేజర్ చెరుకుపల్లి సాయికుమార్(32)ను సంప్రదించి తమ పథకం వివరాలు చెప్పారు. కస్టమర్ల నుంచి వచ్చిన డబ్బులు వాటాల రూపంలో పంచుకుందామని చెప్పి ఒప్పించారు. గత సంవత్సరం ఏప్రిల్ 16 నుంచి మోష్పబ్లో మోసాలకు తెరలేపారు. ఈ తరహాలో మాదాపూర్‌లోని మోష్పబ్లో 40 రోజులుగా ఈ ముఠా సభ్యులు పలువురిని మోసం చేశారు. దాదాపు 50 నుంచి 60 మందిని మోష్ పబ్‌కు రప్పించి మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు.. ఢిల్లీకి చెందిన డెవిల్స్ క్లబ్ ముఠా సభ్యులు ఆకాశ్ కుమార్, సూరజ్‌కుమార్, అక్షత్ నరుల, తరుణ్, శివరాజ్ నాయక్, రోహిత్ కుమార్‌తో పాటు మాదాపూర్ మోష్పబ్ మేనేజర్ చెరుకుపల్లి సాయికుమార్, నిర్వాహకులు టి.తరుణ్, గంట జగదీశ్, నవోదయ గిల్లా.. మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.40 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఈ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలి..
డేటింగ్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఈ తరహా మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని డీసీపీ సూచించారు. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు నిందితులను పట్టుకునేందుకు వీలుంటుందన్నారు. గతంలో ఢిల్లీ, బెంగళూర్‌తోపాటు ప్రస్తుతం హైదరాబాద్‌లో మోసాలు చేసిన వీరు కొద్ది రోజుల్లో మకాం నాగ్‌పూర్‌కు మార్చి అక్కడ కూడా ఇదే తరహాలో మోసాలకు పాల్పడేందుకు సిద్ధమయ్యారని, ఇంతలో వారిని పట్టుకున్నామన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్ మల్లేశ్, ఎస్ఐ వెంకటరమణ పాల్గొన్నారు.