చార్మినార్, అక్టోబర్ 11 : ప్రకృతిని గొప్పగా ఆరాధించే ఉత్సవం బతుకమ్మ.. రకరకాల పూలను ఒక్కచోట అలంకరించి బతుకమ్మగా కొలువడం మన ప్రత్యేకత. దేశంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించడం మన సంస్కృతి సంప్రదాయాలకు దక్కిన గుర్తింపు.. అని నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. సోమవారం పాతనగరంలోని పేట్లబుర్జు సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని మన సంస్కృతిలో భాగస్వామ్యం చేసుకుంటూ నిర్వహించే ఈ వేడుకలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ వేడుకల్లో నగర అడిషినల్ కమిషనర్ శిఖా గోయెల్, దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్తోపాటు పోలీస్ విభాగంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ అధికారులు, పోలీసు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.