బంజారాహిల్స్, సెప్టెంబర్ 17: బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో మరింత నాణ్యమైన ఎక్స్‌రే సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎఫ్డీఆర్ స్మార్ట్-ఎఫ్ పేరుతో అత్యాధునిక డిజిటల్ రేడియోగ్రఫీని ఏర్పాటు చేశామని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో అధునాతన రేడియోగ్రఫీ యంత్రాన్ని నందమూరి బాలకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఎక్స్ రేలు తీసేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని, 8 గంటల్లో 200కు పైగా ఎక్స్ రేలు తీయవచ్చన్నారు. గతంలో కేవలం ఫిలిమ్ మీదనే ఎక్స్‌రేలు తీసేవారని, డిజిటల్ రూపంలో కూడా ఎక్స్‌రే అందుబాటులోకి వస్తుండటంతో వెంటనే వైద్యులు పరిశీలించి చికిత్సను ప్రారంభించే వీలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో సీఈవో డా॥ ఆర్వీ ప్రభాకర్‌రావు, డా॥ టీఎస్‌రావు, డా॥వీరయ్య చౌదరి పాల్గొన్నారు.