సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డు లోపల ఒకే చోట వెయ్యి ప్లాట్లతో రూపుదిద్దుకుంటున్న తొర్రూర్ హెచ్ఎండీఏ లేఅవుట్‌కు కొనుగోలు దారుల నుంచి మంచి స్పందన కనిపించింది. శుక్రవారం తొర్రూరులోని 117 ఎకరాల స్థలంలో అభివృద్ధి చేసే లేఅవుట్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రీ బిడ్ సమావేశం నిర్వహించింది. మొదటి దశలో లేఅవుట్లోని 223 ప్లాట్ల విక్రయానికి సంబంధించిన ప్రీ బిడ్ సమావేశంలో ఆన్లైన్ వేలం, లేఅవుట్లో కల్పించే మౌలిక సదుపాయాలను సమావేశానికి వచ్చిన వారికి అధికారులు వివరించారు. సుమారు 300మంది ఔత్సాహికులు లేఅవుట్‌ను చూసేందుకు వచ్చారు.
మార్చి మూడో వారంలో ఆన్లైన్ వేలం
హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ తొర్రూరులో 117ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో 30ఎకరాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను కల్పిస్తూ 223ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మార్చిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఆన్లైన్ వేలం (ఈ ఆక్షన్) పద్ధతిలో విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.
రెండేండ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి
లేఅవుట్లో అంతర్గత రహదారులు, ఫుట్‌పాత్‌లు, పచ్చదనం, విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, సీవరేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతులను హెచ్ఎండీఏనే కల్పిస్తుందని బి.ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు. సుమారు రెండేండ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. మార్చి 14 నుంచి 17 వరకు ఆన్లైన్ వేలం ఉంటుందని, అప్పటి వరకు ప్లాట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, తమ సందేహాలను వెబ్సైట్లో లేదా అధికారులను అడిగి తెలుసుకోవచ్చని సూచించారు. ఈ సమావేశంలో హెచ్ఎండీఏ సెక్రెటరీ పి.చంద్రయ్య, ఓఎస్డీ ఎం.రాంకిషన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి, హెచ్ఎండీఏ సూపరింటెండెంట్ ఇంజినీర్ పరంజ్యోతి, ఈఈ అప్పారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దీపక్ హాజరయ్యారు.
స్టాల్స్ ఏర్పాటు చేసిన బ్యాంకులు
కాగా హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసినవారికి రుణాలు మంజూరు చేయడానికి వీలుగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కొటాక్ మహీంద్ర బ్యాంక్ అధికారులు ప్రీ బిడ్ మీటింగ్ వద్ద ప్రత్యేకంగా తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన వారికి రుణాలు ఇచ్చే పద్ధతులను వివరించారు.