బంజారాహిల్స్, డిసెంబర్ 13 : బంజారాహిల్స్ రోడ్ నం.13లోని అంబేద్కర్‌నగర్ బస్తీకి చెందిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కొంత మంది వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నించగా, స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. షేక్‌పేట మండలం సర్వే నం. 403లోని టీఎస్ నం.2, బ్లాక్, వార్డు 11లోకి వచ్చే అంబేద్కర్‌నగర్ బస్తీలో సుమారు 300 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది. దీన్ని 15 ఏండ్ల కిందటే స్థానికుల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించారు. ఆ స్థలంలో రెండు గుడిసెలు ఉండగా, వారికి ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించారు.
అయితే తమకు ఇక్కడే స్థలం ఇవ్వాలంటూ వారు గుడిసెలు ఖాళీ చేయలేదు. ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అప్పటి నుంచి కమ్యూనిటీ హాల్ పనులు నిలిచిపోయాయి. 2015లో సైతం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ హాల్ కోసం రూ.15 లక్షలు కేటాయించి శంకుస్థాపన సైతం చేశారు. అయితే మరోసారి న్యాయపరమైన అడ్డంకులు ఎదుర్కొవడంతో పనులు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, శనివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు వచ్చి ఈ స్థలం తమదని చెబుతూ చదును చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
దీంతో బస్తీ నేతలు, స్థానికులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది, బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బస్తీకి చెందిన స్థలంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను రానిచ్చే ప్రసక్తే లేదని బస్తీవాసులు ఆందోళన చేపట్టారు. ఈ స్థలం కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్ కోసం కేటాయించాలని, ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.