చర్లపల్లి, డిసెంబర్ 27 : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎన్ఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, చైర్మన్ డాక్టర్ కమల్కపూర్, ఈసీఐఎల్ సీఎండీ అనురాగ్కుమార్ పేర్కొన్నారు. ఏఎస్రావు నగర్ డివిజన్ డీఏఈ కాలనీలోని అణు ఇంధన కేంద్రీయ విద్యాలయం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రాహుల్ సింగ్ గౌతమ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా ఉన్న అణు ఇంధన కేంద్రీయ విద్యాలయం స్కూల్స్‌లో డీఏఈ ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించడంతో పాటు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… ఈ విద్యాలయంలో తాను కూడా చదువుకున్నానని, స్కూల్ అభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ నటుడు లోబో చేసిన సందడి అందరిని ఆకర్షించాయి. అలాగే పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు రోమాసింగ్, నాయుడు, ప్రవీణ్ అలగానీ, ఉమాకాంత్, రాబిన్సన్, పద్మసింగ్, అనిల్‌కుమార్, డానియల్, కస్తూరిలతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు 1500 మంది పాల్గొన్నారు.