కుత్బుల్లాపూర్,ఆగస్టు3: జ్వరంతో బాధపడుతున్న 16 ఏండ్ల బాలిక వైద్యం కోసం వెళ్లగా.. తన వృత్తిధర్మాన్ని మరిచిన వైద్యుడు నీచానికి ఒడిగట్టాడు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నిస్తుండగా భయాందోళనకు గురైన బాధితురాలు కేకలు వేసింది. దీంతో కీచక వైద్యుడి భాగోతం బయటపడింది. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుచిత్ర ప్రాంతానికి చెందిన 16 ఏండ్ల బాలిక జ్వరంతో బాధపడుతుంది. జీడిమెట్ల విలేజ్‌లో క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్‌రెడ్డి వద్దకు బాలిక తన మామను తీసుకుని వెళ్లింది. అయితే, వైద్య పరీక్షల పేరు చెప్పిన డాక్టర్.. ఆమె వెంట వెళ్లిన మామను క్లినిక్ బయట కూర్చోమన్నాడు. ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా సదరు బాలిక కేకలు వేసింది. బయట ఉన్న మామ లోపలికి వెళ్లి, డాక్టర్‌ను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి, కీచక వైద్యుడిని రిమాండ్‌కు తరలించారు.