Hyderabad Development | అత్తెసరుతో సరిపెట్టారు.. మాటల్లోనే రీజియన్.. చేతల్లో ఏదీ విజన్?!
‘తెలంగాణను మూడు భాగాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అవుటర్ రింగు రోడ్డు వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)... అవుటర్ నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు సెమీ అర్బన్.. ఆపై గ్రామీణం’ ఇదీ.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజలకు చూపుతున్న గ్రాఫిక్ చిత్రం.
- ఔటర్ సరిహద్దుగా మహా నగర అభివృద్ధి అంటూ ప్రకటనలు
- బడ్జెట్లో మాత్రం గ్రేటర్ దాటని కేటాయింపులు
- రూ.1100 కోట్ల అరకొర కేటాయింపుతో ఈ ఏడాదీ పట్టాలెక్కని మైట్రో విస్తరణ
- లక్షన్నర కోట్ల మూసీ సుందరీకరణకు రూ.1500 కోట్లు
- సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికీ అరకొర కేటాయింపులే
Hyderabad Development | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 25 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణను మూడు భాగాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అవుటర్ రింగు రోడ్డు వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)… అవుటర్ నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు సెమీ అర్బన్.. ఆపై గ్రామీణం’ ఇదీ.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజలకు చూపుతున్న గ్రాఫిక్ చిత్రం. మరి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వ విజన్ ప్రతిఫలించాలి కదా! కానీ గురువారం శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో అవన్నీ మాటలకే పరిమితం అని తేలిపోయింది. అంతేకాదు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రావిభాగం కూడా కర్ర పెత్తనానికే తప్ప అభివృద్ధి ప్రణాళిక అమలుకు ప్రాతిపదిక కాదనే వాస్తవమూ తేటతెల్లమైంది.
గతంలో మాదిరిగా ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు జరిపారే తప్ప కాంగ్రెస్ సర్కారు విజన్‌గా చెప్పుకునే మహా నగర విస్తరణ (పరిధి పెంపు)కు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన పెంపునకు చిల్లిగవ్వ కేటాయింపు లేదం టే టీసీయూఆర్ అనేది కేవలం కాగితాలకే పరిమితంగా స్పష్టమవుతుంది. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు అంటూ భట్టి విక్రమార్క ఘనంగా చెప్పుకున్నా.. కొన్ని శాఖల కేటాయింపులతో ప్రాజెక్టులు అటు ముందుకు.. ఇటు వె నక్కి వెళ్లలేక సందిగ్ధంలో పడిపోనున్నాయని ఆయా శాఖల అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ… చేదు అనుభవం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా విస్తరిస్తూ 2007లో అధికారికంగా నిర్ణయం తీసుకుంది. నగరం చుట్టూ ఉన్న 12 మున్సిపాలిటీలతో పాటు 8 గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ ఎంసీహెచ్‌ను జీహెచ్ఎంసీగా మారుస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ విస్తరణ కేవలం కాగితాలకే పరిమితమైంది. పేరుకు గ్రేటర్ హైదరాబాద్ అయినా శివారు ప్రాంతాలు మంచినీరు, మురుగునీటి పారుదల, రోడ్లు.. ఇలా కనీస సౌకర్యాలు లేకుండా కునారిల్లిపోయాయి.
2007 మొదలు 2014 వరకు శివారు ప్రాంతాల మౌలిక వసతుల కల్పనను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నీటి సరఫరా మెరుగపడి… 15 రోజులకోసారి నల్లా నీళ్లకు నోచుకునే కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి వంటి ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా మొదలైంది. ఇదొక్కటే కాదు… ఫ్లైఓవర్లు, స్కైవేలతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రధాన నగరం కంటే చుట్టూ ఉన్న ప్రాంతాలే అన్నిరంగాల్లో అత్యధికంగా అభివృద్ధి చెందాయి.
1100 కోట్లతో మెట్రో విస్తరణ జరిగేనా?
శాసనసభలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేటాయించింది రూ.1100 కోట్లు అయినా… ఈ ఆర్థిక సంవత్సరం ప్రాజెక్టు పనులు పట్టాలెక్కే సూచనలు లేవనేది సుస్పష్టం. పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయించగా… రూ.2వేల కోట్ల అంచనా వ్యయంలో భూసేకరణకు రూ.800 కోట్ల అవసరమవుతుందని అంచనా. దీంతో అటు భూసేకరణ పూర్తయ్యేలా లేకపోగా… కీలకమైన పీపీపీ విధానం మరో అడ్డంకిగా మారింది. దీంతో ఈ చిక్కుముళ్లు వీడేందుకు ఎంత సమయం పడుతుందో అధికారులకూ అంతుబట్టడంలేదు.
కిలోమీటరుకు రూ.250 కోట్ల వరకు వ్యయం అయ్యే 29 కిలోమీటర్ల ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు కేటాయించారు. ఇవి సర్వేలకూ సరిపోని పరిస్థితి. ఇలా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3-5వేల కోట్ల వరకు కేటాయింపులు ఉంటే తప్ప ముందుకు కదలని మెట్రో రైలుకు కేవలం రూ.1100 కోట్లు కేటాయించడంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఏమీచేయలేని అయోమయ పరిస్థితి. ఇక… లక్షన్నర కోట్ల రూపాయల మూసీకి ఈ బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించారు. అంటే అప్పులే తమకు గిట్టవు అన్నట్లుగా ప్రకటనలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున రుణాలు తీసుకోనుందనేది దీని ద్వారా బట్టబయలైంది.
జలమండలికి ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకే నిధులు కేటాయించారుగానీ గ్రేటర్ సరిహద్దు దాటి మౌలిక వసతుల కల్పనకు కించిత్తు అవకాశం కల్పించలేదు. హెచ్ఎండీఏకు పేరుకు రూ.500 కోట్ల అభివృద్ధి నిధులు అన్నారేగానీ ఏ ప్రాజెక్టుకు అనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ చేతిలోని కీలకమైన ఎలివేటెడ్ కారిడార్లకు సుమారు రూ.3800 కోట్ల వరకు వ్యయం అవుతున్నందున ఆ నిధులూ ఎటూ సరిపోని పరిస్థితి. మరోవైపు అత్యంత కీలకమైన సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శించింది. వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ సహా నగరంలో గడ్డి అన్నారం, అల్వాల్, ఎర్రగడ్డ ఆస్పత్రుల నిర్మాణానికి కేవలం రూ.260 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.
విస్తరణ..కాగితాలపైనేనా
గత ఏడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహా నగర విస్తరణపై కొత్త పల్లవి అందుకున్నది. ఔటర్ రింగు రోడ్డు వరకు కోర్ ఏరియా అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మొదలుపెట్టిన ఈ రాగం హైడ్రాతో ఒకడుగు ముందుకేసింది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి నిధుల కేటాయింపు కూడా ఇదే తరహాలో ఉంటుందనే ఆసక్తి నెలకొన్నది. కానీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం నిధుల కేటాయింపు తీరు గ్రేటర్ హైదరాబాద్ ప్రాతిపదికనే జరిగింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ విభాగాల కేటాయింపుల్లో ఇప్పటికే పురోగతి ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే కేటాయించారు.
కానీ గ్రేటర్‌ను దాటి ఉన్న ప్రాంతాలకు మౌలిక వసతుల విస్తరణ కోసం ఎలాంటి అవకాశం కల్పించలేదు. అందునా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలోనూ హైడ్రా (హైదరాబాద్ విపత్తు నివారణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ)ను ప్రస్తావిస్తూ విపత్తులు వచ్చినపుడు ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ వాస్తవంగా గ్రేటర్‌ను దాటిన ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ అనేది సమస్యగా ఏమీలేదు. అక్కడ కావాల్సింది… గ్రేటర్‌కు సమానంగా మౌలిక వసతుల కల్పన. అయినా ఈ అంశాన్ని అటు ప్రసంగంలోనూ ఇటు కేటాయింపుల్లోనూ రేవంత్ సర్కారు విస్మరించింది. గ్రేటర్‌ను దాటి టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు అనుగుణంగా ఈ బడ్జెట్లో కించిత్తు అడుగుపడలేదు. దీంతో గతంలో మాదిరిగానే అవుటర్దాకా మహా నగర విస్తరణ అనేది కేవలం కాగితాలకే పరిమితం అవుతుందా? అనే ఆందోళన వ్యక్తమవుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

