మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 23: అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు.. దేశ ప్రగతిలో కూడా పురుషులతో సమానంగా పాలుపంచుకోవాలని తెలంగాణ ఏడీజీపీ (సీఐడీ) శిఖా గోయల్ అన్నారు. కండ్లకోయ గ్రామ శివారులో ఉన్న మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో మహిళా ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణా తరగతులను శుక్రవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు డీజీపీ మాట్లాడుతూ.. సమాజ సేవ చేయడానికి పోలీస్ శాఖను ఎంచుకున్న మహిళలు.. శిక్షణ సమయంలో శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధించాలన్నారు. నేడు అన్ని రంగాల్లో మహిళలు సునాయసంగా రాణిస్తున్నారని, పోలీస్ శాఖలో కూడా చురుకుగా పాలుపంచుకోవడం శుభపరిణామన్నారు. తెలంగాణలోని 11 జిల్లాల నుంచి వచ్చిన 422 మంది మహిళా కానిస్టేబుళ్లకు 9 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ మధుకర్ స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.