బండ్లగూడ, డిసెంబర్ 28: పుట్టిన రోజు వేడుకలు విషాదాన్ని నింపింది. సరదాగా షికారుకు వెళ్లిన వారు.. రోడ్డు ప్రమాదం బారినపడ్డారు. ఇద్దరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన విరాల ప్రకారం..ఒడిశాకు చెందిన కాశీనాథ్ వైశాలిదాస్ దంపతులు గచ్చిబౌలి ఇజ్జత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఈ దంపతులు సోమవారం తమ పుట్టిన రోజు వేడుకను ఇంట్లో జరుపుకొన్నారు. స్నేహితులు యాల ప్రేమ్‌కుమార్, మనోజ్(30), గగన్పహన్ వేడుకకు హాజరయ్యారు.
ప్రేమ్‌కుమార్ రాత్రి సరదాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసొద్దామని.. అతడి స్నేహితుడైన సాయినాథ్ కారును తీసుకొని.. అద్దె డ్రైవర్ అయిన సుశీల్గుప్తా (24)తో కలిసి బయలుదేరారు. మార్గమధ్యలో మద్యం కొనుగోలు చేసి తాగారు. అనంతరం గచ్చిబౌలి నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. శంషాబాద్ వద్దకు వెళ్లగానే డ్రైవర్ సుశీల్గుప్తా కారును షాద్‌నగర్ వైపు తిప్పాడు. తిరుగు ప్రయాణంలో అతివేగంతో హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొట్టాడు. కారు నుజ్జునుజ్జు అవ్వగా, అందులో ఇరుక్కుపోయిన వారిని పోలీసులు బయటకు తీశారు. మనోజ్ అక్కడికక్కడే మృతి చెందగా, సుశీల్గుప్తా చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన కాశీనాథ్, అతడి భార్య వైశాలిదాస్, గగన్, ప్రేమ్ చికిత్స పొందుతున్నారు.