సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 1: పొమ్మనలేక పొగ పెట్టిన చందంగా కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టీ) దవాఖానాలో ఆర్యోగశ్రీ పథకం కింద పనిచేస్తున్న 24 మంది ఉద్యోగుల దుస్థితి మారింది. గత 15 ఏళ్లుగా ఈఎన్టీ దవాఖానాలోని ఓపీ రిజిస్ట్రేషన్, ఎక్స్‌రే, ఆడియాలజీ, రేడియాలజీ, ధోబీ తదితర విభాగాలలో సేవలందిస్తున్న 24 మంది ఉద్యోగులు సెప్టెంబర్ 1న విధులకు హాజరు కాలేదు. దీంతో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ ఓరుగల్లు రవి శంకర్ ప్రజాపతి ప్రత్యామ్నాయంగా సెక్యూరిటీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థినులతో ఓపీ రిజిస్ట్రేషన్, ఎక్స్‌రే, అంబులెన్స్ డ్రైవర్, రేడియాలజీ, ఆడియాలజీ విభాగాలలో పని చేయించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని వారు వివరించారు.
ఈ విషయమై దవాఖాన ఇంచార్జి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా తాము ఆరోగ్యశ్రీ ఉద్యోగులను వద్దని చెప్పలేదని, గత ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇస్తామని చెప్పామని అన్నారు. కానీ సెప్టెంబర్ నెల నుండి వేతనాలు అందించలేమని స్పష్టంగా చెప్పామన్నారు. అందుకే 1వ తేదీ నుండి వారికి అటెండెన్స్ రిజిస్టర్‌ను రద్దు చేశామన్నారు. కాగా ఆరోగ్యశ్రీ కింద పని చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని చెప్పలేదని ఆయన వివరించారు. ఈ నెల నుండి జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందంటే వారే విధులకు రాలేదని అన్నారు.
ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానాలో ఆరోగ్యశ్రీ పథకం కింద గత 15 ఏళ్లుగా వరుసల వారిగా 24 మంది ఉద్యోగులను తీసుకొని దవాఖానాలోని పలు విభాగాలలో పని చేయిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు నెలలుగా ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ నివాస్ తమను పిలిచి పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లిస్తామని అంటే ఆగస్టు వరకు చెల్లిస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెల నుండి వేతనాలు ఇవ్వడం కష్టమని మీరే ఆలోచించుకోవాలని చెప్పడంతోపాటు 1వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు అటెండెన్స్ రిజిస్టర్ ఉండదని స్పష్టం చేశారని అన్నారు.
అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం లేదంటే తమ ఉద్యోగాలు ఉన్నట్లా లేనట్లా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా 24 మంది ఉద్యోగులు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును, డీఎంఈ డాక్టర్ వాణిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పందించి డీఎంఈ డాక్టర్ వాణికి ఫోన్ చేసి ఒకేసారి 24 మంది ఉద్యోగులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన డీఎంఈకి తెలిపారు.