శేరిలింగంపల్లి, జులై 11: ఐటీ కారిడార్లో రానురానూ శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. చిన్న వాగ్వాదంలో భాగంగా నలుగురు యువకులు బైకుపై వచ్చి అర్ధరాత్రి మరో యువకుడిని కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ ఘటనలో సొమాలియా దేశానికి చెందిన విద్యార్థి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల మేరకు సొమాలియాకు చెందిన ఆహ్మద్(25) హిమాయత్ నగర్ లోని ఓ కాలేజీలో బీసీఏ చదువుతున్నాడు. మాసబ్ ట్యాంక్ వద్ద నివాసం ఉండే సొమాలియాకు చెందిన తన స్నేహితుడు యూనిస్ అబ్ది కరీం హసన్ తో కలిసి ద్విచక్ర వాహనంపై ఐటీ కారిడార్ కు వచ్చారు.
ఈ నెల 8న రాత్రి 2 గంటల ప్రాంతంలో నాలెడ్జ్ సిటీలోని ఇషా హోటల్ వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా వెనక నుంచి రెండు బైకులపై నలుగురు యువకులు వచ్చారు. యూటర్న్ తీసుకునే విషయంలో గొడవ జరగడంతో వెనక వచ్చిన నలుగురు యువకులు సొమాలియాకు చెందిన వారిపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఓ యువకుడు సొమాలియా విద్యార్థి అహ్మద్ కడుపులో కత్తితో పొడిచి పారిపోయారు.
అతడికి తీవ్ర గాయం కావడంతో బాదితుడికి మాదాపూర్ లోని మెడికోవర్లో శస్త్ర చికిత్స చేశారు. ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు తెలిపారు. బైకులపై వచ్చి దాడికి పాల్పడిన యువకుల కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బైక్ ల నెంబర్లు కనిపించకపోవడంతో ఐటీ కారిడార్ లో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.