ఖైరతాబాద్, మే 5 : మండు వేసవి సాయంత్రం సాగర తీరంలో ఆహ్లాదాన్ని పంచే సమ్మర్ ఉత్సవ్ మేళా నేటి నుంచి ప్రారంభం కానున్నది. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా వేదిగా ఏర్పాటైన ఈ మేళా విశేషాలను నిర్వాహకులు మీర్జా రఫీక్ బేగ్ మీడియాకు వెల్లడించారు. గత 20 సంవత్సరాలుగా దేశ, విదేశాలతో పాటు వివిధ రాష్ర్టాలు, నగరంలోని పీపుల్స్‌ప్లాజాలో ఈ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలయ్యాయని, ఈ నేపథ్యంలో అలాంటి వారికి ఉపాధి చూపించేందుకు ఇక్కడ వారి ఉత్పత్తులను విక్రయించుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. చిన్నారులకు ఆటవిడుపు కలిగించే జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్సర్, డ్రాగన్ రైలు, రాతి యుగం నాటి మనుషుల జీవన విధానం, రోబోటిక్స్ ద్వారా రూపొందించిన పులులు, జింకలు, ఏనుగు, గోరిల్లా (కింగ్‌కాంగ్) లాంటి అద్భుతమైన కళారూపాలు ఆకట్టుకుంటాయన్నారు. వంద ఫీట్ల పరిమాణంలో కార్లు, బైక్‌లు ఫీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు.
పెద్దల కోసం చేనేత, చేతివృత్తులు, ఫుట్‌వేర్, డ్రెస్‌మెటీరియల్, ఫుడ్ స్టాల్స్ మొత్తం 250 స్టాల్స్ ఏర్పాటు చేశామని, తద్వారా సుమారు 500 కుటుంబాలకు ఉపాధి కల్పించామన్నారు. నేటి నుంచి సుమారు 45 రోజుల పాటు ఈ మేళా ఉంటుందని, నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు.