సికింద్రాబాద్, జూన్ 28: చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ దొంగతనానికి స్కెచ్ వేశారు. ఎనిమిది మంది అగంతకులు పెద్దమొత్తంలో కొల్లగొట్టాలని ప్రయత్నించారు. వివరాలలోకి వెళ్తే… పంజాగుట్టకు చెందిన సతీష్‌కుమార్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పద్మారావునగర్ ఓ భవనంలోని నాలుగో ఫ్లోర్లో జ్యోతి మెడికల్ హాలు పేరిట హోల్‌సేల్ వ్యాపారం జరుపుతున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రులు, రిటైల్ మెడికల్ షాపులకు మందులు సరఫరా చేస్తుంటాడు.
ఈనెల 28న తెల్లవారుజామున 3:20 గంటలకు ముసుగులు ధరించి జ్యోతి మెడికల్ హాలు భవనం వద్దకు వచ్చి విధుల్లో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కత్తులతో బెదిరించి వారి సెల్ఫోన్లను తీసుకున్నారు. వారిని మెట్లపై మోకాళ్లపై కూర్చోబెట్టారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్, కట్టర్ ఇతర పరికరాలతో కార్యాలయం డోర్లను తెరిచారు. క్యాష్ కౌంటర్ తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ. 27,500 నగదు తీసుకున్నారు. తిరిగి వెళ్తుండగా సెక్యూరిటీ గార్డుల వద్ద ఉన్న రూ.2.500ను కూడా తీసుకున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించి అక్కడి నుంచి పారిపోయారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ నర్స య్య, చిలకలగూడ డివిజన్ ఏసీపీ శశాంక్‌రెడ్డి, డీఐ మధుబాబులు ఘటన స్థలానికి చేరుకుని సెక్యూరిటీ గార్డులతో మాట్లాడి నేరం జరిగిన తీరును తెలుసుకున్నారు.