పెద్దఅంబర్‌పేట, నవంబర్ 15: మినీ బస్సు, లారీ ఢీకొన్న ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో రామోజీ ఫిలింసిటీ గేటు ఎదురుగా శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ట్రావెల్స్‌కు చెందిన మినీ బస్సు 32 మంది ప్రయాణికులతో మియాపూర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌కు బయలుదేరింది. పెద్దఅంబర్‌పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దిగింది. మినీ బస్సులోని 32 మంది ప్రయాణికులను అక్కడే విశాఖపట్నం వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సులోకి ఎక్కించారు.
మియాపూర్ వెళ్లేందుకు మినీ బస్సును డ్రైవర్ అనిల్‌గౌడ్ రామోజీ ఫిలింసిటీ గేటు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా, అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేగంగా వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మినీ బస్సు దెబ్బతిన్నది. డ్రైవర్ అనిల్‌తోపాటు కండక్టర్ భార్గవ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. సమన్వి ట్రావెల్స్ మేనేజర్ సోమిశెట్టి నాగార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.