వెంగళరావునగర్, జూలై 20: ప్రేమించిన యువతితో జరిగిన పెండ్లిని రహస్యంగా ఉంచి మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడో ఓ వంచకుడు. ఆ విషయం తెలిసి నిలదీసేందుకు వెళ్తే.. బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలో నివాసించే ఓ యువతి(24) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. రెండేళ్ల క్రితం జగిత్యాలకు చెందిన హరీశ్(25) ఆమెను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. హరీశ్‌ను ప్రేమను సదరు యువతి కూడా అంగీకరించింది. కొంతకాలం తర్వాత సదరు యువతిని హరీశ్ అమీర్‌పేట దుర్గమ్మ గుడిలో వివాహం కూడా చేసుకున్నాడు. అయితే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి కాపురం కూడా పెట్టారు. ఈ క్రమంలో సదరు యువతి గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు.
అయితే ఇటీవల తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఊరెళ్లిన హరీశ్.. అక్కడ మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ ఫొటోలను అతని స్నేహితుల ద్వారా అందుకున్న సదరు యువతి.. హరీశ్ ఊరికి వెళ్లి అతని కుటుంబసభ్యులను కలిసింది. ఇప్పటికే తనను పెండ్లి చేసుకుని మరో అమ్మాయితో పెండ్లికి ఎలా సిద్ధమయ్యావని హరీశ్‌ను నిలదీసింది. కానీ అంతా ఒక్కటై సదరు యువతిని బెదిరించారు. హరీశ్‌తో సంబంధం లేదని రాయించి ఆమెతో బలవంతంగా సంతాకాలు చేసుకున్నారు. అలాగే గతంలో జరిగిన పెండ్లి విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి.. అక్కడి నుంచి పంపించేశారు. దీంతో జిన్నారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కేసును మధురా నగర్ పీఎస్‌కు బదిలీ చేశారు.