ఖైరతాబాద్, డిసెంబర్ 28 : గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్‌లోని ఆల్ఫైన్ హైట్స్ టవర్స్ రెండో బ్లాక్ ఐదో అంతస్తులోని ఫ్లాట్ నం.506లో అలికా మాథూర్ (70), ఆమె కుమార్తె అశిత మాథూర్ (45) మాథూర్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం వంట చేసేందుకు స్టవ్ వెలిగించగా, గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిని అర్పేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో భయంతో బయటకు పరుగులు తీసి చుట్టు పక్కల వారికి చెప్పారు. తక్షణమే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించగా, అగ్ని మాపక సిబ్బందిని రప్పించారు. నాలుగు ఫైరింజన్ల ద్వారా సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
భయంతో పరుగులు తీసిన నివాసితులు
గ్యాస్ లీకై మంటలు అంటుకున్న కొద్ది సేపటితే భారీ శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. దీంతో ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ దాటికి ఇంట్లోని ఫ్యాన్లు, సామాగ్రి, ఫర్నీచర్ కాలిబూడిదయ్యాయి. పెద్ద ఎత్తున శబ్దం వచ్చి మంటలు, దట్టమైన పొగలు రావడంతో చుట్టు పక్కల ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10లక్షలకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
కుక్కపిల్లను కాపాడిన సిబ్బంది
అగ్ని ప్రమాదం నేపథ్యంలో తల్లి, కూతుళ్లు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కాని వారు పెంచుకుంటున్న కుక్కపిల్ల మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే క్రమంలో ఓ మూలాన దాక్కున్న కుక్కపిల్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భవనంలో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఫైర్ అధికారి వెంకన్న తెలిపారు.

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్ 28: ప్లాస్టిక్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టాటానగర్‌లోని సర్వే నెంబర్ 134/20లో శివానంద బ్రదర్స్ ప్లాస్టిక్ గ్రేయిన్ వర్క్స్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ మాదిరిగానే కార్మికులు శనివారం రాత్రి పరిశ్రమను మూసివేసి తాళాలు వేసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు గమనించి రాజేంద్రనగర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో చంద్రానాయక్ నేతృత్వంలో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో పరిశ్రమలోని ప్లాస్టిక్, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైంది.