సిటీబ్యూరో: లోపలేస్తా నా కొడుకా..! తమాషా చేస్తున్నారా..? అంటూ ఓ మహిళా ఇన్స్పెక్టర్ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఇంటి వద్ద పోలీసు జులం పరిమితులు దాటి హల్చల్ సృష్టించారు. సీఐ మాట్లాడిన వ్యవహార శైలికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మంగళవారం బీఆర్ఎస్ నేత క్రిశాంక్ నివాసం వద్దకు కార్ఖానా సీఐ అనురాధ తమ బృందంతో వెళ్లారు. క్రిశాంక్ భార్య ఆయన ఇంట్లో లేడని ఎంత చెప్పినా.. వినకుండా గట్టిగా అరుస్తూ సీఐ ఆవేశంతో రగిలిపోయారు. ఇంట్లో చిన్న పాప ఉందనే విషయాన్ని చెబుతున్నా వినకుండా తలుపులు నెట్టుకుంటూ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు.
వచ్చిరాగానే ఇంటి బయట పనిచేసుకుంటున్న పనివాళ్లను ఉద్దేశిస్తూ ఏమి రా.. లోపలేస్తా నాకొడుకా… తమషాలు చేస్తున్నారా..? తలుపులు తీయండంటూ తీవ్రంగా హెచ్చరించారు. మీ అరుపులకు పసిపాప భయపడుతుందని కుటుంబ సభ్యులు కోరుతున్నా మహిళా సీఐ మాత్రం తన నోరు పారేసుకుంటున్న వీడియో దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అయితే బయట నుంచి వచ్చిన క్రిశాంక్‌ను పోలీసులు బలవంతంగా లాక్కిళ్లి వాహనంలో ఈడ్చి పారేశారు.