దుండిగల్, జూలై 11: అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు ఐదంతస్తుల భవనం టెర్రస్ పైనుంచి కిందపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతినగర్ లోని, గోదావరి కట్స్ సమీపంలోనున్న ఐకాన్ ప్రైమ్ రోజ్ అపార్ట్మెంట్, 5వ అంతస్తు లోని ఓ ఫ్లాట్ లో వెంకట సుబ్బారెడ్డి, హరిత దంపతులు గత 6 సంవత్సరాలుగా నివాసముంటున్నారు.
దంపతులు ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండగా వీరి ఏకైక కొడుకు సాయి విశాంత్ రెడ్డి (17) ఇంటర్ పూర్తి, ఇటీవల ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. ఇంజనీరింగ్లో సీటు కోసం ఎదురుచూస్తున్నాడు. జిమ్ చేసి రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేయడం అలవాటు ఉన్న విశాంత్ రెడ్డి గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భోజనం ముగించుకుని వాకింగ్ చేస్తానంటూ టెర్రస్ పైకి వెళ్ళాడు.
కొద్దిసేపటి అనంతరం విశాంత్ రెడ్డి టెర్రస్ పైనుంచి అనుమానాస్పద స్థితిలో కింద పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే క్షతగాత్రుడుని చికిత్స కోసం కూకట్ పల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే విశాంత్ రెడ్డి మృతి పై తమకు ఎటువంటి అనుమానాలు లేవని తల్లిదండ్రులు పేర్కొంటున్నప్పటికీ, పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.