ఉప్పల్, ఫిబ్రవరి 26 : కిరాణా దుకాణం షట్టర్ తొలగించి అందులో నగదు చోరీ చేసిన నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ గాంధీనగర్ లోని మార్కెటింగ్ ప్రాంతంలో హోల్సేల్ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. కిరాణా దుకాణాన్ని గ్యాన్ చంద్ శర్మ, రామ్ కిశోర్ అనే ఇద్దరు షాపు ను 8 ఏండ్ల నుంచి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం షాపు మూసివేసి యధావిధిగా ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఆదివారం తెల్లవారుజామున షాపు షట్టర్ తొలగించి ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న నిర్వాహకులు వచ్చి చూడగా.. షట్టర్ ఓపెన్ చేసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. దుకాణంలోని రూ.7 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. షాపులోకి వెళ్లే ముందు దొంగలు సీసీ కెమెరాలు బెండ్ చేసి లోపలికి ప్రవేశించారు. చోరీ చేయడం, నగదు దొంగిలించే దృశ్యాలు షాప్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఫుట్ పాత్ లపై నిద్రిస్తూ .. చోరీలు
చోరీ చేసిన గుర్తుతెలియని వ్యక్తులను పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ కు చెందిన మహ్మద్ ఖాదర్( 48), అబ్దుల్ ఖాదీర్(48), రాజేంద్రనగర్ చెందిన షేక్ అబ్దుల్(42) లను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి నుంచి చోరీ చేసిన రూ.5 లక్షల 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.